ప్రతీ ఒక్కరి ఏదో ఒక రకమైన ఫోబియా ఉంటుంది. కొందరికీ నీళ్లు అంటే భయంగా ఉంటుంది. మరికొందరికీ నలుగురిలో కలవడం అంటే భయంగా ఉంటుంది. దీనినే ఫోబియాగా అభివర్ణిస్తుంటారు. ఫోబియా అనే ఒక మానసిక వ్యాధికి లక్షణంగా చెబుతుంటారు. ఇటీవల ఇలాంటి ఫోబియాలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మహిళలను కొత్త రకమైన ఫోబియా వెంటాడుతోంది.
ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మహిళలను టోకోఫోబియా అనే సమస్య వేధిస్తోంది. ఇంతకీ ఏంటీ సమస్య.? దీనివల్ల జరిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మహిళలు సంతానం పట్ల భయంతో ఉండడమే టోకోఫోబియా. ఇది ఒక మానసిక సమస్య. ఈ ఫోబియా కారణంగా మహిళలు గర్భం దాల్చడం, పిల్లలకు జన్మనివ్వడం విషయంలో భయపడుతుంటారు. ఈ భయం మహిళల జీవితాలను అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది.
గర్భం దాల్చడం, డెలివరీ విషయంలో లేదా నవజాత శిశువుకు సంబంధించి ఏదైనా చెడు అనుభవం ఎదురుకావడం, లేదా ఇతరులకు జరిగిన చెడు అనుభవాల కారణంగా ఈ ఫోబియా వస్తుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. గర్భధారణ సమయంలో సంభవించే శారీరక మార్పులు, ఆరోగ్య ప్రమాదాల గురించి కూడా ఆందోళన చెందుతుంటారు. నిరాశ, ఆందోళన, అపోహలు, అనవసరమైన భయాలు టోకోఫోబియాకు కారణమవుతుండొచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఈ ఫోబియాతో బాధపడేవారు ఎలాంటి సందేహం లేకుండా మానసిక నిపుణులు సంప్రదించాలని చెబుతున్నారు. అవసరమైన కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..