రాయచూర్, జనవరి 24: తన భర్త ఆత్మహత్యకు కారణమైన మైక్రోఫైనాన్స్ కంపెనీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఓ మహిళ వినూత్నంగా నిరసన చేపట్టింది. రాష్ట్ర హోంమంత్రి జి పరమేశ్వరకు మృతుడి భార్య గురువారం మంగళసూత్రం పంపింది. హిందూ ధర్మశాస్త్రంలో మంగళసూత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. హిందూ మహిళల వైవాహితకు ప్రతీకగా ధరించే పవిత్రమైన పసుపు తాడు. అలాంటి పసుపు తాడు మైక్రోఫైనాన్స్ కంపెనీ సిబ్బంది దుశ్చర్యవల్ల తనకు దూరమైందని, తనను వితంతువుగా మార్చిందని ఆందోళన వ్యక్తం చేసింది. తన భర్తను వేధింపులకు గురిచేసి చిత్రహింసలకు గురిచేసి.. అతడి మృతికి కారణమైందని మృతుడి భార్య పార్వతి ఆరోపించింది. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. బాధితురాలికి మద్దతుగా పలు స్థానిక సంస్థలు కూడా ముందుకొచ్చాయి. ఈ క్రమంలో పార్వతి రాయచూర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ను కలిసి సంఘటనకు సంబంధించి మెమోరాండం సమర్పించింది.
అసలేం జరిగిందంటే..
రాయచూరు జిల్లా మాన్వి పట్టణానికి సమీపంలోని కపగల్ గ్రామానికి చెందిన శరణబసవ అనే వ్యక్తి క్యాబ్ డ్రైవర్‌గా, కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న శరణబసవ.. ప్రైవేట్ మైక్రోఫైనాన్స్ కంపెనీ నుంచి రూ.8 లక్షల రుణం తీసుకున్నాడు. అయితే సకాలంలో ఈఎంఐలు చెల్లించలేదని మైక్రోఫైనాన్స్ కంపెనీ సిబ్బంది తనను రోజూ వేధింపులకు గురిచేయడం ప్రారంభించారు. దీంతో వేధింపులు తాళలేక జనవరి 17న విషం తాగి సూసైడ్ చేసుకుని మృతి చెందాడు. మైక్రోఫైనాన్స్ సిబ్బంధి వేధింపుల కారణంగా మృతుడి గ్రామంలో పలువురు ఇప్పటికే పరారీలో ఉన్నట్లు స్థానికులు పేర్కొన్నారు. మైక్రోఫైనాన్స్ కంపెనీల చిత్రహింసలపై హోంమంత్రి జి. పరమేశ్వర గురువారం ఉడిపిలో స్పందిస్తూ.. మైక్రోఫైనాన్స్ కంపెనీలు వినియోగదారులపై ఒత్తిడి తెస్తున్నాయని, భౌతికదాడులకు పాల్పడుతున్నారని, తమ ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నారని అన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని హామీ మంత్రి హామీ ఇచ్చారు.
దీనిపై కర్ణాటక ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డి కుమారస్వామి కోరారు. ఈ అంశంపై జనవరి 25న బెంగళూరులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమావేశం నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాలు ధృవీకరించాయి. మైక్రోఫైనాన్స్ కంపెనీల వేధింపులను అరికట్టేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా డిప్యూటీ కమిషనర్ల కార్యాలయాలు అర్జీలు పోటెత్తాయి. ఒక్క బెలగావి జిల్లాలోనే 2.71 లక్షల దరఖాస్తులు వచ్చాయంటే అక్కడి పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్ధం చేసుకోవచ్చు. బాగల్‌కోట్ (89,037), విజయపుర (75,000), మాండ్య (42,500), గడగ్ (41,116), ధార్వాడ్ (36,489), రామనగర్ (33,326), హసన్ (24,556), చిక్కబళ్లాపుర (22,054) చొప్పున ఫిర్యాదులు వచ్చాయి. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైక్రోఫైనాన్స్ సంస్థలపై (ఎంఎఫ్‌ఐ) నియంత్రణను కోల్పోయిందని, పేదలను వేధింపులకు గురిచేస్తున్నారని కర్నాటక మాజీ సీఎం, బీజేపీ ఎంపి బసవరాజ్ బొమ్మై ఎద్దేవా చేశారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.