బిగ్ మీటింగ్‌కి వేదిక కాబోతోంది అమెరికా. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని గంటల్లో సమావేశం కాబోతున్నారు. ఒకరినొకరు ఫ్రెండ్ అని ఆప్యాయంగా పిలుచుకునే ఈ ఇద్దరి మీటింగ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2.o అంటూ దూకుడు చూపిస్తున్న ట్రంప్‌తో హ్యాట్రిక్ పీఎం ఏం మాట్లాడతారని… కేవలం భారత్, అమెరికానే కాదు ప్రపంచదేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి. డిపోర్టేషన్‌తో పాటు వాణిజ్య వ్యవహారాలపైనా ఈ ఇద్దరు నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఇక అమెరికా 47వ అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ కుర్చీనెక్కిన దగ్గర్నుంచి… సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వంలోని దాదాపు అన్నీ సెక్టార్స్‌నీ కెలికేశారు. అలాగే ప్రపంచదేశాలు ఉలిక్కిపడేలా మైగ్రేషన్ పాలసీని టచ్ చేస్తూ.. ఇల్లీగల్ మైగ్రేంట్స్ మీద పగపట్టారు. ముఖ్యంగా అమెరికాలో ఉంటున్న ఇండియన్ మైగ్రేంట్లే ట్రంప్ మాస్టారికి ఫస్ట్ టార్గెట్టయ్యారు. అక్రమంగా మా దేశంలో ఉంటున్న మీవాళ్ల సంఖ్య 7 లక్షల 25 వేలు. వీళ్లలో 18 వేల మందిని రౌండప్ చేశాం అంటూనే 104 మందిని మీ దేశానికి పంపించేస్తున్నాం.. ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్.. అని చాటింపు వేసిమరీ పంపించేసింది అమెరికాలో కొత్త గవర్నమెంట్. ఒక్కొక్కరి మీద 4 లక్షలు ఖర్చు పెట్టి.. మిలిటరీ విమానమెక్కించి.. టెక్సస్ నుంచి అమృత్‌సర్‌కి డిపోర్ట్ చేసింది. దీన్ని బట్టే అర్థమౌతోంది.. మనోళ్ల మీద ట్రంపు సారు ఎంత సీరియస్‌గా ఉన్నారో.
ఇటు వీసా రూల్స్‌ను కఠినంగా మార్చే పనిలో పడ్డారు ట్రంప్. H1B వీసాపై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన.. నిబంధనలు మరింత కఠినతరం చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. H1B వీసా భారీ వేతనాలు ఉన్నవాళ్లకు మాత్రమే ఇవ్వాలని.. అది కూడా ఏడాదికి 75వేలకు మాత్రమే పర్మిట్ చేయాలంటూ సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీ నుంచి ట్రంప్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. అలాగే F1, M1 వీసాలపైనా ఫోకస్ చేశారు ట్రంప్. చదువు కోసం వెళ్లిన వాళ్లు వెంటనే తిరిగి వెళ్లిపోయేలా రూల్స్‌ని కఠినంగా మార్చే పనిలో పడ్డారు.
అలాగే.. భారత్‌కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2023-24లో ఇరుదేశాల మధ్య 118 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్యం జరిగింది. ఇందులో భారత్‌కు అమెరికా దిగుమతుల కంటే అమెరికాకు భారత్ ఎగుమతులే 32 బిలియన్ డాలర్లు ఎక్కువగా ఉన్నాయి. అయితే అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక సుంకాలు విధిస్తోంది అంటూ గతంలో ట్రంప్ అనేక సార్లు ఆరోపణలు చేశారు. భారత్‌ను టారిఫ్ కింగ్‌గా అభివర్ణించారు కూడా. ఇలాంటి నేపథ్యంలో ఇరువురి భేటీ ప్రధాన్యతను సంతరించుకుంది.
మొత్తంగా… ట్రంప్, మోదీ సమావేశంలో భారతీయులను వెనక్కి పంపించే ప్రక్రియపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే వాణిజ్యంతో పాటు రక్షణ, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. దిగుమలపై సుంకాలపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి ఇద్దరు మిత్రులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో…!
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి