3 నెలల క్రితం నుంచి ఆమె జాడలేదు. నలుగురు కొడుకులు.. నలు దిక్కులా ఆమె ఆచూకి కోసం ప్రయత్నించారు. తమ తల్లి ఇంటికి రాకపోతుందా అని ఆశపడ్డారు. అందరూ దేవుళ్లకు మొక్కారు. అయితే ఫైనల్‌గా ఆమె ఆచూకి చిక్కింది. అయితే ఆమె భౌతికంగా లేరు. కనీసం ఆమె అంత్యక్రియలు కూడా చేసే అవకాశం లేకపోవడంతో కొడుకులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
Kistamma
బంధాలు, అనుబంధాలకు భారత్‌లో ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఎవరో కొందరుప్రబుద్ధులు తప్పితే అందరూ తల్లిదండ్రులను దేవుళ్లుగా భావిస్తారు. తాజాగా తల్లి ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆ బిడ్డలు తల్లడిల్లిపోయారు. తల్లి కోసం తిరగని ప్రదేశం లేదు… వెళ్ళని ఊరు లేదు.. అడగని మనిషి లేడు.నెలల తరబడి తల్లి కోసం అనేక ప్రాంతాల్లో వెతికారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో నిత్యం కన్నీరు మున్నీరుగా విలపించేశారు. తల్లి మళ్లీ తమ ఇంటికి క్షేమంగా తిరిగి వస్తుందని, ప్రతిరోజు ఎదురుచూపులే. అయితే వారి ప్రయత్నాలు ఫలించలేదు. దేవుడు కరుణించి తమ బాధను తీరుస్తాడంటే ఆ దేవుడు కూడా తమపై జాలి చూపు లేదని ఆ కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. క్షేమంగా ఇంటికి తీసుకెళ్లవలసిన తమ తల్లికి ఇలా నివాళులర్పించవలసి వస్తుందని తాము కలలో కూడా అనుకోలేదని వారి రోదనలు ప్రతి ఒక్కరిని కలిచివేశాయి. ఇంటి నుంచి వెళ్లిపోయిన మాతృమూర్తికి మూడు నెలల తర్వాత నివాళులర్పించిన పరిస్థితి ఆ కుటుంబానిది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో చోటు చేసుకుంది.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో గత డిసెంబర్ నెలలో గుర్తు తెలియని వృద్ధురాలి శవానికి అన్నం ఫౌండేషన్ సాయంతో పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. మూడు నెలల తర్వాత విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు జరిగిన చోటకు వచ్చి నివాళులు అర్పించి కన్నీరు మున్నీరుగా విలపించారు. నల్లగొండ జిల్లా కేతపల్లి మండలం ఉప్పలపహాడ్‌కు చెందిన కుక్కమూడి కిష్టమ్మకు నలుగురు కుమారులు. గత ఏడాది నవంబర్ 27న వేములవాడలోని బంధువుల ఇంటికి ఒంటరిగా వెళ్తూ ప్రమాదవశాత్తు సాగర్ కాల్వలో పడి గల్లంతైంది. డిసెంబర్ 17న పాలేరు వద్ద సాగర్ కాలువలో వృద్ధురాలి మృతదేహాన్ని గుర్తించారు. అప్పటికే శవం గుర్తు పట్టలేని స్థితిలో ఉండడంతో మార్చురీలో భద్రపరిచారు. పోలీసులు సోషల్ మీడియా ద్వారా ఆమె ఆచూకీ కోసం ప్రయత్నించినప్పటికీ వివరాలు తెలియకపోవడంతో డిసెంబర్ 25న మృతదేహానికి అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సాయంతో అంత్యక్రియలు పూర్తిచేయించారు. అనంతరం వాట్సాప్‌లో ఓ గ్రూప్ నుంచి మరో గ్రూప్‌కు ఫొటోలు షేర్ చేస్తుండడంతో కిష్టమ్మ కుటుంబీకులు ఆ ఫోటోలు చూడటంతో విషయం బయటపడింది. దీంతో వారు నేలకొండపల్లి పోలీసులను ఆశ్రయించగా ఆమె అంత్యక్రియలు పూర్తయినట్లు చెప్పడంతో శ్మశాన వాటికలో కృష్ణమ్మ అంత్యక్రియలు నిర్వహించిన చోట నివాళులర్పించి భారమైన హృదయంతో ఆమె కుటుంబ సభ్యులు వెనుదిరిగారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..