ఇంటి పెరట్లో అనేక రకాల మొక్కలు పెంచుకోవడం చాలా మందికి అలవాటు. వీటిలో కూరగాయలు, పండ్లు, పూల మొక్కలు.. అభీష్టాన్ని బట్టి పెంచుకుంటూ ఉంటారు. అయితే వీటిల్లో పారిజాతం మొక్కను తప్పనిసరిగా పెంచుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఈ మొక్కలోని ప్రతి భాగం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే నేటి కాలంలో గ్రామాల్లోనే కాకుండా అనేక పట్టణ నివాసుల ఇళ్లలో కూడా ఈ మొక్కలు కనిపిస్తాయి. పట్టణాల్లో కొద్దిపాటి స్థలం ఉన్నా దానిని వదలకుండా ఈ మొక్కలను పెంచుతున్నారు. అపార్ట్ మెంట్లలో నివసించే వారైతే చిన్న కుండీల్లో ఈ మొక్కలు పెంచుతున్నారు. చాలా మంది తమ ఇంటి చుట్టూ ఉన్న స్థలంలో పూలు, పండ్లు వంటి ఇతర ఆకర్షణీయమైన మొక్కలను పెంచడానికి చాలా ఆసక్తిని కనబరుస్తున్నారు.
ఈ రకమైన మొక్కలను ఇంటి బాల్కనీలో పెంచడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన మొక్కల్లో పారిజాత ఒకటి. కొందరు దీనిని రాత్రి మల్లె అని కూడా పిలుస్తారు. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధమే
పారిజాత మొక్కలోని పూలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తాయి. టైప్ 2 డయాబెటిస్ చికిత్సలో వీటిని ఉపయోగిస్తారని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఈ పువ్వులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. రాత్రి సమయంలో పారిజాత పుష్పాలను నీటిలో వేసి బాగా మరిగించాలి. నీటిని వడకట్టి మరుసటి రోజు మధ్యాహ్నం, సాయంత్రం ఆ నీటిని తాగాలి. ఇలా తాగితే షుగర్ లెవెల్ అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
కీళ్ల నొప్పులకు దివ్యౌషధం
పారిజాత చెట్టు కొమ్మలను చిన్న ముక్కలుగా కోసి ఎండబెట్టి మెత్తగా నూరి.. గాలి చొరబడని డబ్బాలో మూత పెట్టి నిల్వ చేయాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అర టీస్పూన్ ఈ పొడిని ఒక గ్లాసు నీటిలో కలుపుకుని తాగడం వల్ల మలేరియా, కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
జలుబుకు సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం
చలికాలంలో చాలా మంది జలుబు, దగ్గు, గొంతునొప్పి తదితర సమస్యలతో బాధపడుతుంటారు. కొంతమందికి ఆస్తమా వంటి సమస్యలు కూడా ఉంటాయి. అటువంటి శ్వాస సమస్యలు ఉన్నవారు పారిజాత ఆకులు, పువ్వులతో చేసిన టీ తాగవచ్చు. ఇందులో రుచి కోసం తేనె కలిపి ప్రతిరోజూ తాగాలి. ఇది ఊపిరితిత్తులలో పేరుకుపోయిన కఫాన్ని తగ్గిస్తుంది. జలుబు సంబంధిత సమస్యలన్నింటినీ తగ్గిస్తుంది.