ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జెండా ఎగిరింది.. 27 ఏళ్ల తర్వాత కాషాయ పార్టీ దేశ రాజధానిలో తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకుంది.. 12 ఏళ్లుగా ఢిల్లీని పాలించిన ఆప్.. ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. ఈ ఎన్నికలు మరోసారి కాంగ్రెస్‌కు తీవ్ర నిరాశను మిగిల్చాయి. కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరవలేదు.. ఢిల్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఆప్, బీజేపీ మధ్యే ఉంటుందని మొదటి నుంచి అంతా భావించారు.. చివరకు అదే జరిగింది.. ఒకప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన కాంగ్రెస్.. ఈసారి ఏమైనా ఊహించని ఫలితాలు సాధిస్తుందేమో అనుకున్నారు ఆ పార్టీ నేతలు.. కానీ.. అసలు పోటీ కూడా ఇవ్వలేకపోయింది.. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ 47 సీట్లలో ఆధిక్యంలో ఉండగా.. ఆమ్ ఆద్మీ పార్టీ 23 స్థానాల్లో ముందంజలో ఉంది.. కాగా.. ఢిల్లీలో బీజేపీ తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. అభివృద్ధి, సుసంపన్న పాలన గెలిచిందంటూ పేర్కొన్నారు.
ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ, అభివృద్ధి, సుసంపన్న పాలన గెలిచిందని ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేసింది. ఆప్ ప్రభంజనానికి చెక్ పెడుతూ బీజేపీ ఢిల్లీ పీఠాన్ని అధిరోహించేందుకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా పీఎం మోదీ ట్విట్టర్ వేదికగా ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. జనశక్తి సర్వోన్నతం.. అభివృద్ధి గెలిచింది, సుసంపన్న పాలన గెలిచింది. ఢిల్లీలోని నా అన్నదమ్ములూ, అక్కచెల్లమ్మలకు చారిత్రక విజయం అందించినందుకు నా వందనం.. అభినందనలు అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.
మీరు అందించిన అపారమైన ఆశీర్వాదం, ప్రేమకు హృదయ పూర్వక కృతజ్ఞతలు అని ట్వీట్ లో పేర్కొన్నారు. ఢిల్లీలో సమగ్ర అభివృద్ధి సాధించేందుకు, ఇక్కడి ప్రజల జీవన విధానంలో ఎలాంటి లోటు లేకుండా పనిచేస్తాం.. ఇది మా హామీ అన్నారు. అదేవిధంగా.. అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణంలో ఢిల్లీ కీలక పాత్ర పోషించేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..