ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం భారతదేశంతోపాటు.. ప్రపంచంలోని పలు రంగాల ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రత్యేకంగా సంభాషించారు. WAVES (World Audio Visual & Entertainment Summit) సమ్మిట్ అడ్వైజరీ బోర్డు సమావేశంలో భాగంగా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు రంగాల అగ్రశ్రేణి నిపుణులు, అత్యున్నత ప్రముఖులతో శుక్రవారం రాత్రి ప్రధాని మోదీ భేటీ అయి.. పలు కీలక విషయాలను చర్చించారు. ఈ సందర్భంగా వివరాలను అడిగితెలుసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంభాషించిన ప్రముఖులలో నటులు అమితాబ్ బచ్చన్, చిరంజీవి, దిల్జిత్ దోసాంజ్, రజనీకాంత్, షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్, అనిల్ కపూర్, అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్, ఎఆర్ రెహమాన్ తోపాటు పలువురు సినిమా ఇండస్ట్రీ సెలబ్రిటీలు ఉన్నారు.. వారితోపాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా లాంటి వ్యాపార దిగ్గజాలు సైతం ఉన్నారు.
ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 9 వరకు భారతదేశం మొదటి వరల్డ్ ఆడియో-విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (WAVES)ను నిర్వహిస్తోంది. భారతదేశం త్వరలో ప్రపంచ స్థాయి కంటెంట్ సృష్టి, సృజనాత్మక రంగ సహకార కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ‘మన్ కీ బాత్’ రేడియో ప్రసంగంలో ప్రకటించారు.
ఈ సమ్మిట్ ద్వారా నరేంద్ర మోదీ ప్రభుత్వం.. కొత్త ఆవిష్కరణలు, ప్రపంచ నాయకత్వం, భారతదేశ సాంస్కృతిక, సాంకేతిక ప్రభావం, ప్రపంచ వేదికపై భారతదేశ స్థానాన్ని బలోపేతం చేసే వ్యూహాలపై దృష్టి పెట్టడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రఖ్యాత వేవ్స్ సమ్మిట్ వివిధ రంగాల నుంచి నిపుణులను ఒకచోట చేర్చి, అంతర్-పరిశ్రమ సహకారాన్ని పెంపొందించడం, డిజిటల్, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో భారతదేశం, వృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
వేవ్స్ సమ్మిట్ 2025..
విభిన్న రంగాల్లో ప్రసిద్ధి చెందిన, అలాగే ఆలోచనాపరులైన ప్రముఖులను ఏకం చేయడానికి సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వేవ్స్ సమ్మిట్ 2025ను నిర్వహిస్తోంది. వివిధ రంగాల్లో పరిశ్రమల సహకారాన్ని ప్రోత్సహించడానికి, డిజిటల్, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో భారతదేశ వృద్ధిని వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఫిబ్రవరి 5-9, 2025 వరకు జరగనున్న WAVES సమ్మిట్‌లో భాగంగా, మంత్రిత్వ శాఖ క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్, సీజన్ 1 ను కూడా ప్రారంభిస్తోంది.. ఇందులో ఆవిష్కరణలు, సృజనాత్మకతను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్రం పలు నిర్ణయాలు తీసుకోనుంది.. ఈ సమ్మిట్ పరిశ్రమలోని కీలక ప్రముఖులు, వాటాదారులు, ఆవిష్కర్తలను ఒకచోట చేర్చనుంది.. వాస్తవానికి, నవంబర్‌లో గోవాలో జరిగే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)తో పాటు ఈ సమ్మిట్‌ను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..