తెలంగాణలో కులగణన పూర్తి చేశాం.. ఈ కులగణనలో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి.. అంటూ లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చలో భాగంగా రాహుల్‌గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దేశంలో 90 శాతం జనాభా ఉన్న ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలకు హక్కులు దక్కడం లేదంటూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో నిర్వహించిన కులగణన గురించి ప్రస్తావించారు.. తెలంగాణలో కులగణన పూర్తి చేశామని, 90 శాతం జనాభా ఈ వర్గాలే ఉన్నట్టు తేలిందన్నారు. తెలంగాణ జనాభాలో 90 శాతం మంది ఓబీసీలు.. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు ఉన్నారంటూ రాహుల్ గాంధీ వివరించారు. బీజేపీలో కూడా 50 శాతం మంది ఎంపీలు ఓబీసీ వర్గానికి చెందిన వాళ్లేనని, కానీ వాళ్లకు మాట్లాడే అధికారం లేదంటూ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టినప్పుడే ఆయా వర్గాలకు న్యాయం జరుగుతుందని స్పష్టంచేశారు. దీని కోసం దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రపతి ప్రసంగంలో కొత్త విషయాలు లేవని.. నిరుద్యోగ సమస్యను నుంచి దేశం బయట పడలేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా వల్ల ఎలాంటి మార్పు జరగలేదని వివరించారు. ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా నినాదం మంచిదే అయినప్పటికీ.. దాని లక్ష్యం నెరవేరడం లేదన్నారు రాహుల్‌గాంధీ. నిరుద్యోగ సమస్యను అప్పటి యూపీఏ ప్రభుత్వంతో పాటు ఇప్పటి ఎన్డీఏ సర్కార్ కూడా పరిష్కరించలేదన్నారు. ఉత్పత్తి రంగంలో చైనా మనకంటే పదేళ్లు ముందుందని, భారత్ పూర్తిగా వెనకబడిపోయిందంటూ పేర్కొన్నారు. తయారీరంగంపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు.
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గోల్‌మాల్ జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు రాహుల్‌గాంధీ. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయన్నారు. ఎన్నికలకు ముందు ఐదు నెలల్లో 70 లక్షల ఓటర్లను చేర్చారని, దీనిపై ఈసీ సమాధానం చెప్పాలంటూ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఐదు నెలల్లో కొత్తగా 70 లక్షల ఓటర్లు చేర్చారని.. షిర్డీలో ఒకే భవనంలో 7000 ఓటర్లను చూపించారంటూ రాహుల్ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు పెరిగారని.. ఈసీ ఓటర్ల డేటాను విడుదల చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..