మూడు దశాబ్దాల వర్గీకరణ పోరాటానికి ముగింపు పలుకుతూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటన కూడా చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమగ్ర కుల సర్వే నిర్వహించి, షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ)లో ఉప వర్గీకరణను అమలు చేసేందుకు చారిత్రాత్మక చొరవ తీసుకున్నందుకు కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ అభినందించింది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు పరిష్కారం చూపిన విషయం ప్రజలకు చేరవేసేలా కాంగ్రెస్ అధినాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఎస్సీ వర్గీకరణపై మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ నివేదిక రూపొందించింది. ఏక సభ్య కమిషన్ ఇచ్చిన రిపోర్ట్‌కు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మూడు గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ చేస్తూ.. కేబినెట్ సబ్ కమిటీ, ఏకసభ్య కమిషన్ ఇచ్చిన ప్రతిపాదనలకు సభ్యులంతా మద్దతు తెలిపారు. గ్రూప్-1లో సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగాల్లో అత్యంత వెనుకబడిన 15 కులాలను చేర్చారు. వారికి ఒక శాతం రిజర్వేషన్ ప్రతిపాదించారు. గ్రూప్-2లో మాదిగలతో పాటు 18 ఉపకులాలను చేర్చారు. వీరికి 9శాతం రిజర్వేషన్ ప్రతిపాదించారు. గ్రూప్-3లో మాలలతో పాటు 26 ఉప కులాలు చేర్చారు. వీరికి 5శాతం ప్రతిపాదించారు. మొత్తం 15శాతం రిజర్వేషన్ మూడు గ్రూపులుగా విభజించింది. ఎస్సీ కులాల గ్రూప్‌లకు రోస్టర్ పాయింట్లు, క్రిమీలేయర్ విధానాన్ని కూడా అమలు చేయాలని కమిషన్ సిఫారసు చేసింది. జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్‌కు తెలంగాణ శాసనసభ, శాసన మండలి ఆమోదం తెలిపాయి.
ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో సీఎం ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని.. దేశంలోనే వర్గీకరణ అమలుచేసే మొదటి రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పలు జిల్లాల్లో పర్యటించి సమగ్ర నివేదిక రూపొందించిన ఏకసభ్య కమిషన్ వర్గీకరణ చేయాలని సిఫారసు చేసిందని అన్నారు. అమలుపై ప్రతిపాదనలు చేస్తున్నానని వర్గీకరణకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని రేవంత్ రెడ్డి అన్నారు.
ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ భేటీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వేపై మీటింగ్‌లో ఆరు గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగింది.
కులగణన ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కులగణన చట్టబద్దం అయినా కాకపోయినా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం సీట్లు బీసీలకు కేటాయించే బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకోవాలన్నారు. పార్టీలో చేరిన వారితో కలిసి పని చేయాలన్నారు. రేషన్‌కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల విషయంలో ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృతి చేయాలన్నారు. ఈ పథకాలకు లబ్దిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ అన్న విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు సీఎం రేవంత్. అలాగే, స్థానిక సంస్థల ఎన్నికల్లో వీలైనన్ని గ్రామాలు ఏకగ్రీవం అయ్యేలా చూసుకోవాలని ప్రజాప్రతినిధులకు మార్గనిర్దేశం చేశారు ముఖ్యమంత్రి. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచేలా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు.
ఈ నేపథ్యంలోనే ప్రజలకు చేస్తున్న మంచి పనులను క్షేతస్థాయిలో తీసుకువెళ్ళేలా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఫిబ్రవరి నెలలో రెండు భారీ బహిరంగ సభలు నిర్వహించేలా ఫ్లాన్ చేస్తోంది. రాష్ట్రంలో నిర్వహించే సభలకు అధినాయకత్వాన్ని కూడా ఆహ్వానిస్తున్నట్లు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై మెదక్ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని.. ఈ బహిరంగ సభకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తామన్నారు. అలాగే, సూర్యాపేటలో బీసీ బహిరంగ సభకు రాహుల్ గాంధీని తీసుకువస్తామని టీపీసీసీ చీఫ్ తెలిపారు. న్యూఢిల్లీలోని పార్టీ నాయకత్వాన్ని సంప్రదించిన తర్వాత వేదికలు, తేదీలను నిర్ణయిస్తామన్నారు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన మార్పును అణగారిన వర్గాలకు వివరించడానికి ఇది ఒక అవకాశమని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.
ఇదిలావుంటే, తెలంగాణ 1997 నుండి SC వర్గీకరణ కోసం డిమాండ్ ఉంది. 1997లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ , షెడ్యూల్డ్ కులాలలోని మాదిగ, దాని ఉప కులాలకు మరిన్ని ప్రయోజనాలను కోరుతూ ఉద్యమానికి నాయకత్వం వహించారు. అప్పటి నుండి తెలుగు రాష్ట్రాల్లో SC వర్గీకరణ డిమాండ్ పెరుగుతూ వచ్చింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..