తెలంగాణలోని పక్షుల గురించి భవిష్యత్ తరాలకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ (HBP) సభ్యులచే అనుసంధానం చేయబడిన “బర్డ్స్ ఆఫ్ తెలంగాణ” పాకెట్ గైడ్ ఉపయోగపడుతుందని ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం ప్రజా భవన్లో హైదరాబాద్ బర్డింగ్ పాల్స్(HBP) సభ్యులచే అనుసంధానం చేయబడిన “బర్డ్స్ ఆఫ్ తెలంగాణ” పాకెట్ గైడ్ ను డిప్యూటీ సీఎం ఆవిష్కరించారు. ఈ పుస్తకం అవసరాన్ని హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ (HBP) కోర్ కమిటీ సభ్యులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్బంగా హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ (HBP) సభ్యులు”బర్డ్స్ ఆఫ్ తెలంగాణ” పాకెట్ గైడ్‌ను రూపొందించడానికి వారు చేసిన కృషిని, వారి అవగాహన కార్యక్రమాలను ఉపముఖ్యమంత్రి అభినందించారు.
హైదరాబాద్ బర్డింగ్ పాల్స్(HBP) ప్రెసిడెంట్ ఆడెపు హరికృష్ణ తెలంగాణ పక్షుల గురించి మొదటి పాకెట్ గైడ్ యొక్క ప్రాముఖ్యతను, ఆవశ్యకతను ఉప ముఖ్యమంత్రికి వివరించారు. ఈ పుస్తకం తెలంగాణ పక్షుల ఆహారం, వలసలు, పరిరక్షణ స్థితి గురించి తెలుసుకోవటానికి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పారు. ఈ పుస్తకం విద్యార్థులు, ప్రకృతి ఔత్సాహికులు, విభిన్న ప్రేక్షకులను ప్రత్యేక జీవ వైవిధ్యంతో కూడుకొన్న తెలంగాణ ప్రకృతితో మమేకం కావటానికి ప్రోత్సహిస్తుంది. మొత్తం 252 ముఖ్యమైన పక్షి జాతులను కలిగి ఉన్న ఈ పాకెట్ గైడ్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల, ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఉచితంగా అందించబడుతుందని వివరించారు.