![బాబోయ్ కుక్కలు.. రోజుకు 300 మందిని కరిచేస్తున్నాయ్.. ఎక్కడో కాదు మనదగ్గరే..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/stray-dogs.jpg)
గ్రేటర్ హైద్రాబాద్‌లోనే కాదు.. తెలంగాణ అంతటా గ్రామ సింహాలు గర్జిస్తున్నాయి. వీధికుక్కల దాడుల్లో, గత మూడేళ్లలో తెలంగాణలో 36 మంది మృత్యువాత పడ్డారు. ఇక 3 లక్షలమందికి పైగా కుక్క కాటుకు ఆస్పత్రుల పాలయ్యారు. ఒక్క హైదరాబాద్ మహానగరంలోనే లక్ష మందికి పైగా కుక్కకాటు బాధితులు హాస్పిటల్స్‌కి క్యూ కట్టారు. తెలంగాణ హైకోర్టు సుమోటోగా ఈ కేసు తీసుకోవడంతో ఈ లెక్కలన్నీ అధికారికంగా బయటపడ్డాయి. హైదరాబాద్‌లో ఇంత ప్రమాదకర స్థాయిలో వీధి కుక్కల దాడులు పెరిగిపోవడానికి కారణం ఏంటి? ఇంతకీ అధికారులు ఏం చేస్తున్నారు. ఇక గత మూడేళ్లలో హైదరాబాద్‌లో వీధికుక్కల దాడులు ఏ మేరకు పెరిగాయో చూడండి.
తెలంగాణలో కుక్కల బెడద ఆందోళనకర స్థాయికి చేరుకుందని గణాంకాలు చూపిస్తున్నాయి.. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 300 కి పైగా కుక్క కాటు సంఘటనలు నమోదవుతున్నాయని.. వీటిలో గ్రేటర్ హైదరాబాద్‌లోనే 100 కేసులు ఉన్నట్లు నివేదికలు తెలిపాయి..
హైదరాబాద్‌ని వణికిస్తున్న వీధికుక్కల దాడులు
- హైదరాబాద్‌లో 2022లో 31,141 కుక్క కాటు కేసులు నమోదు
- 2023లో 36,849 కేసులు నమోదు
- 2024లో 42,067కి పెరిగిన సంఖ్య
- మొత్తం 1,10,057 కుక్కకాటు కేసులు నమోదు
- మూడేళ్లలో 35 శాతం పెరిగిన వీధికుక్కల దాడులు
- తెలంగాణలో నమోదైన కేసులు 3,33,935
- వీధికుక్కల దాడుల్లో 2022లో 8మంది, 2023లో 15మంది, 2024లో 13మంది ప్రాణాలు కోల్పోయారు
- గత ఏడాది మేడ్చల్-మల్కాజిగిరిలో అత్యధికంగా 14,686 కేసులు నమోదు
ఈ మొత్తం వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ హైకోర్టు.. సుమోటోగా కేసును స్వీకరించింది. హైకోర్టు ఆదేశాలతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్… వీధి కుక్కల నియంత్రణకు, వాటి సంతతి పెరగకుండా కుటుంబ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై నివేదికను తయారుచేసి హైకోర్టుకు నివేదించింది. ఆ నివేదికలో వీధి కుక్కలను నియంత్రించడానికి హైదరాబాద్‌లో 5 డాగ్ షెల్టర్స్‌ని ఏర్పాటు చేశామని GHMC పేర్కొంది. ఆ షెల్టర్లలో వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి, కొద్ది రోజుల తర్వాత వాటి టెరిటరీలో వదిలేస్తారు. రేబిస్ రాకుండా వాటికి వ్యాక్సిన్లు వేస్తామని GHMC ఆ నివేదికలో తెలిపింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆరు జోన్లలో GHMC వెటర్నరీ అధికారులు… వీధి కుక్కల దాడులను నియంత్రించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు.
వీధి కుక్కల దాడులు రోజురోజుకు పెరిగిపోతుండడంతో…నగరంలో ప్రజలు వణికిపోతున్నారు. వీధికుక్కలు ఎండాకాలంలో ఎక్కువగా దాడులు చేస్తాయని, తమ దగ్గరకు రోజుకు 300మంది కుక్క కాటు బాధితులు వస్తారని నారాయణ గూడ ఐపీఎం సెంటర్ డైరెక్టర్ శివలీల చెబుతున్నారు.
ఇక నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో పిచ్చి కుక్కల దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆర్మూర్‌లో కుక్కల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు వాపోతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..