హైదరాబాద్, నవంబర్ 27: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 1401 పరీక్ష కేంద్రాల్లో నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్ 3 పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 1,365 గ్రూప్ 3 సర్వీసు పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ ఈ నియామక ప్రక్రియ చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 3 పోస్టులకు 5,36,400 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 2,69,483 మంది పరీక్ష రాశారు. అంటే మొత్తానికి సగం మంది మాత్రమే గ్రూప్ 3 పరీక్షలు రాశారన్నమాట. మొత్తం 3 పేపర్లకు ఈ పరీక్ష జరగగా.. పేపర్ 1 ప్రశ్నపత్రంలో అన్ని సమాధానాలు గుర్తించేందుకు సమయం సరిపోలేదని తొలి రోజు కొందరు అభ్యర్థులు తెలిపారు. ఇక పేపర్ 2 ప్రశ్నపత్రం మధ్యస్థంగా ఉందని, ఇందులో కొన్ని ప్రశ్నలు నేరుగా సమాధానం గుర్తించేవిగా ఉంటే, మరికొన్ని లోతైన విశ్లేషణలతో ఉన్నాయని వెల్లడించారు. పేపర్ 3లో గణాంకాలను గుర్తుంచుకున్న వారికి కాస్త మెరుగ్గా ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. సివిల్ సర్వీస్ పరీక్షల కాన్సెప్ట్ తరహాలో ప్రశ్నలొచ్చినట్టు పలువురు అభ్యర్ధులు పేర్కొన్నారు. సుధీర్ఘకాలంగా ప్రిపేర్ అవుతున్నవారు ఈ పరీక్షలు బాగా రాసే అవకాశం ఉంది. మూడో పేపర్‌లో జరిగిన ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ పేపర్‌లో హైడ్రా, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్ల పథకంపై ప్రశ్నలు అడిగారు.
ఇక ఈ పరీక్షల అధికారిక ప్రిలిమినరీ కీ టీజీపీఎస్సీ త్వరలో విడుదల చేయనుంది. అనంతరం తుది విడుదల చేసి, ఫలితాలు విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కీ ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై అధికారికంగా ఇంకా సమాచారం ఇవ్వనప్పటికీ గ్రూప్ 3 ఫలితాలు డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేసే అవకాశాలున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో పరీక్ష రాసిన అభ్యర్థులు ప్రిలిమినరీ కీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సాధారణంగా గ్రూప్స్ పోస్టులకు పోటీ ఎక్కువ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ పోస్టుల తుదిఫలితాల వెల్లడిలో అవరోహణ క్రమం పాటించకపోవడంతో ఒకే అభ్యర్థి రెండు, మూడు పోస్టులకు ఎంపికయ్యారు. దీంతో అధిక పోస్టులు బ్యాక్‌లాగ్‌గా మిగిలిపోతున్నాయి. ఇలా గురుకులాల్లోనే దాదాపు 2 వేల పోస్టులు బ్యాక్‌లాగ్ కిందకు వచ్చాయి. ఇలా జరగకుండా ఉండేందుకు రీలింక్విష్‌మెంట్ విధానంపై అధ్యయనం చేయాలని అధికారులు యోచిస్తున్నారు. ఇప్పటికే గ్రూప్3 రాతపరీక్షలు పూర్తికాగా డిసెంబర్‌లో గ్రూప్ 2 రాతపరీక్షలు జరగాల్సి ఉంది. ఫిబ్రవరిలో గ్రూప్-1 ఫలితాలు వెల్లడించిన తరువాతే.. గ్రూప్-2, 3 ఫలితాలు ఇస్తే బ్యాక్‌లాగ్ రాకుండా ఉండే ఛాన్స్ ఉంటుందని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది.
ఇవి కూడా చదవండి