ముఖ్యంగా పండగల సీజన్ లో చాలామంది మోటారు సైకిళ్లను కొనుగోలు చేశారు. పండగ సమయంలో వాహనాలు కొనుగోలు చేయడం మంచిదనే సెంటిమెంట్ తో పాటు వివిధ కంపెనీలు అందించిన ఆఫర్లు, తగ్గింపులు దీనికి కారణంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో అక్టోబర్ 3 నుంచి నవంబర్ 13 వరకూ పండగల సీజన్ నడిచింది. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనాలన ప్రజలు పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. దీంతో దాదాపు 14 శాతం వృద్ధి నమోదైంది. వాహనాల విక్రయాలు భారీగా పెరగడానికి ప్రధాన కారణం పండగలు. మన దేశంలో పండగలకు చాలా ప్రత్యేకత ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను ఇంటికి ఆహ్వానించి ఘనంగా జరుపుకొంటాం. అదే సమయంలో కొత్త వస్తువులను కొనుగోలు చేయడం మన సంప్రదాయం. దాని వల్ల మంచి జరుగుతుందని, పండగ సంతోషం గుర్తుండిపోతుందని నమ్ముతారు.
ద్విచక్ర వాహనం అనేది నేడు కనీస అవసరంగా మారింది. ఇది లేకపోతే రోజు వారీ పనులు మందుకు సాగడం లేదు. నేటి ఉరుకులు, పరుగుల జీవితంలో వేగంగా పనులు చేసుకోవడం చాలా అవసరం. దీంతో ప్రతి ఒక్కరూ వీటి కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పండగ సీజన్ లో పాసింజర్ ద్విచక్ర వాహనాల రిటైల్ అమ్మకాలు 6 శాతం పెరిగాయి. మొత్తం 6.5 లక్షల యూనిట్ల విక్రయాలు జరిగాయి. అయితే పండగ సీజన్ లో రిటైల్ అమ్మకాలు బాగున్నప్పటికీ అధిక ఇన్వెంటరీ స్థాయితో పరిశ్రమ టోకు వాల్యూమ్ వృద్ధిని తగ్గించింది. ఇటీవల ముగిసిన పండగల సీజన్ ఆటోమోటివ్ పరిశ్రమకు ఉల్లాసాన్నిచ్చింది. చాలా విభాగాలలో వాహనాల విక్రయాలు జోరుగా సాగాయి. వాణిజ్య వాహనాలను మినహాయించి మిగిలినవి బలమైన పురోగతి సాధించాయి.
గతేడాది అక్టోబర్ నెలలో 18.96 లక్షల యూనిట్లు అమ్ముడు కాగా.. ఈ సారి14.20 శాతం పెరిగాయి. మొత్తం 21.64 లక్షల యూనిట్లను వివిధ కంపెనీలు విక్రయించాయి. కార్లు, ఎస్ యూవీలతో పాటు ద్విచక్ర వాహనాల విక్రయాలు అత్యధిక స్థాయికి వెళ్లాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యఫ్యాక్చరర్స్ (ఎస్ఐఏఎం) నివేదిక ప్రకారం.. ఒక్క అక్టోబర్ నెలలోనే 3.93 లక్షల వాహనాలు అమ్ముడయ్యాయి. ద్విచక్ర వాహనాల పరిశ్రమకు పండగ సీజన్ కలిసి రావడంతో తయారీ దారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా దేశంలో ద్విచక్ర వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ ను ఈ అమ్మకాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి