బెంగళూరుకు చెందిన ఓ ద్విచక్ర వాహనదారుడు వార్తల్లో కెక్కాడు. రికార్డు సంఖ్యలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడటమే అందుకు కారణం. అతడి స్కూటర్‌పై ఏకంగా 311 కేసులు నమోదయ్యాయి. రూ.1.60లక్షల జరిమానా విధించిన పోలీసులు అతడి బైక్‌ను సీజ్ చేశారు. చివరకు ఆ జరిమానా మొత్తం చెల్లించిన వాహనదారుడు బైక్‌ను తీసుకొని వెళ్లిపోయాడు.
బెంగళూరులోని కలాసిపాల్య ప్రాంతానికి చెందిన పెరియాస్వామి ఓ ట్రావెల్ ఏజెన్సీ నడిపిస్తున్నాడు. అతడి స్కూటర్‌పై రికార్డు స్థాయిలో ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదవుతున్నాయి. హెల్మెట్ లేకుండా ప్రయాణం, జర్నీలో మొబైల్ వాడకం, సిగ్నల్ జంప్ తదితర కేసులున్నాయి. అయిన్నప్పటికీ పోలీసులు మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. ఆ వ్యక్తి వాహన చలానాలను ఏడాది కాలంగా గమనిస్తూ వస్తున్న స్థానికంగా ఉన్న మరో వ్యక్తి .. ‘ఆ బైక్‌ను పోలీసులు ఇంకా ఎందుకు సీజ్ చేయలేదంటూ’ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ట్రాఫిక్ ఉల్లంఘన, జరిమానాలకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను జతచేశాడు.
ఆ పోస్టును చూసి మేల్కొన్న బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు.. సదరు స్కూటర్‌పై 311 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఆ చలానాలన్నింటినీ ఒక దగ్గర చేరిస్తే 20 మీటర్లు పొడవు ఉన్నాయి. మొత్తంగా 1,61,500 రూపాయల ఫైన్ విధించిన సిటీ మార్కెట్ ట్రాఫిక్ పోలీసులు.. వాహనాన్ని సీజ్ చేశారు. అయితే, మరుసటి రోజే వాహనదారుడు వచ్చి చలాన్ చెల్లించి బైక్‌ను తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని అతడికి పోలీసులు స్పష్టంగా చెప్పారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి