ఏడేళ్లుగా ఈమెయిల్ పరిచయాలు.. మూడుసార్లు భేటీ.. రతన్ టాటాకు నచ్చిన “తెలుగు కుర్రాడు”

2 hours ago 1

ఆరు లక్షల కోట్ల రూపాయల సంస్థకు అధిపతి రతన్ టాటాను స్వయంగా చూసినవారే అరుదుగా ఉంటారు. ఇక ఆయనతో కలిసి ఫోటో తీయించుకోవడం పెద్ద అదృష్టంగా భావిస్తుంటారు. అటువంటి ప్రపంచ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా తూర్పుగోదావరి జిల్లా కడియంకు చెందిన ఓ పాతికేళ్ల కుర్రాడిని ఇష్టపడ్డాడు అంటే నమ్మడం కాస్త కష్టంగానే ఉంటుంది. కాని ఇది వాస్తవం. అలాగని కడియం నర్సరీ మొక్కలు కొనుగోలు సందర్భంలో ఈ పరిచయం ఏరగపడిందనుకుంటే పొరపాటే. రతన్ టాటాకు ఉన్న ఎన్నో విభిన్నమైన అభిరుచులకు దగ్గరగా ఉండడమే ఈ కుర్రాడు ఆయనకు ఇష్టుడు అయ్యాడు. ఏడేళ్లుగా వారిరువురూ ఈమెయిల్ మెసేజ్ ల ద్వారా పరిచయాలు పెంచుకున్నారు. రతన్ టాటా అభిరుచులకు అనుగుణంగా ఈ కుర్రాడు మెసేజ్ లు, బొమ్మలు పంపించడమే ఇందుకు కారణంగా పేర్కొవచ్చు.

పర్యావరణ ప్రేమికులు రతన్ టాటా

రతన్ టాటా అంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో పాటు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం గురించే మనందరికీ తెలుసు. కానీ వీటితోపాటు పర్యావరణం అంటే ఈయనకు పట్టరాని అభిమానం. ఈ సృష్టిలో ప్రతి జీవరాశి సుఖంగా జీవించాలనే ఆలోచనలో ఈయన ఉంటారు. అందుకు తగిన సహాయ సహకారాలు అందిస్తారు కూడా. అంతరించిపోతున్న ఎన్నో జాతుల మనుగడకు పాటుపడుతుంటారు. అయితే కడియం మండలం కడియపులంక గౌతమి నర్సరీ యువ రైతు మార్గాని వెంకట శేషు ఎంబీఏ చదువుకునే సమయంలో అన్ని రంగాల్లోనూ రతన్ టాటా ఉండడాన్ని గుర్తించారు.

దీంతో అసలు రతన్ టాటా అభిరుచులు ఏంటి అనేదానిపై ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆయన మొక్కలతో పాటు పశుపక్షాదులపై ఎలాంటి అభిమానాన్ని చూపెడతారనేది అవగాహన చేసుకున్నారు. రతన్ టాటా అభిరుచులకు అనుగుణంగా కొన్ని కొటేషన్లను తయారుచేసి ఆయన పెర్సనల్ ఈమెయిల్‌కు శేషు మెసేజ్ చేస్తుండే వారు. 2017 కాలం నుంచి ఈ మెసేజ్ లు పంపడం ప్రారంభించారు. వాటిల్లో కొన్ని నచ్చడంతో పర్సనల్ సెక్రటరీలు రతన్ టాటాకు చూపించడం మొదలు పెట్టారు. అలా కొద్ది రోజులు గడిచేసరికి ఆయనను మరింత ఆకట్టుకునేలా కొన్ని బొమ్మలు వేయించి ఈ కుర్రాడు పంపించారు.

కడియం కుర్రాడు చేసిన బొమ్మలు రతన్ టాటా కు అమితంగా నచ్చాయి. అందుకనే ఈ కుర్రాడు పంపే మెసేజ్ లు, బొమ్మలను తరచూ చూస్తూ ఉండేవారు. ఈ క్రమంలో ఆయనను స్వయంగా కలవాలనే శేషు కోరికను రతన్ టాటా పర్యవేక్షక బృందం అవకాశం ఇచ్చారు. శేషు పుట్టిన రోజున ఆయన ఆశీస్సులు తీసుకునే అదృష్టం కలిగింది. ముంబాయి రతన్ టాటా బంగ్లాలో శేషు కలయిక రెండు నిమిషాల పాటు అనుమతులు రాగా, కలిసిన తర్వాత మరింత సమయం రతన్ టాటా ఈ కుర్రాడుతో గడిపారంటే శేషుపై ఉన్న అభిమానం ఎలాంటిదో స్పష్టమవుతుంది.

అమ్మ చేసిన లడ్డూను రతన్ టాటా ఇష్టపడ్డారు..

ఏళ్ల క్రితం మా అమ్మానాన్నలు మిమ్మల్ని చూడాలని కోరుతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లగా వెంటనే అవకాశం కల్పించారన్నారు. అయితే తల్లిదండ్రులు వీరబాబు, సత్యలు రావాల్సిన విమానం అనివార్య కారణాల వల్ల ఆలస్యమైంది. దీంతో ఆయన ఇచ్చిన సమయానికి వెళ్ళలేని పరిస్థితి. అయితే ఈ విషయాన్ని ఆయన దిష్టి తీసుకెళ్లగా, గంటన్నర ఆలస్యం అయినప్పటికీ వారిని కలుసుకునే అవకాశం ఇచ్చారు. ఇటువంటి కుమారుడు ఉండటం మీ అదృష్టమని తనను కొనియాడారని శేషు తెలిపారు.

ఇదిలావుండగా, ఆయన డ్రై ఫ్రూట్ లడ్డూలను ఇష్టంగా తింటారని తెలిసి శేషు తల్లితో తయారు చేయించి పంపించారు. వాటిని తిని బాగున్నాయని మెసేజ్ పంపినట్లు తెలిపారు. ఈ జనవరిలో రతన్ టాటా ను కలిసినప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని ఆయన అనారోగ్యానికి గురయ్యారనే వార్తలు రావడంతో ఆయన కార్యాలయానికి ఫోన్ చేసి అడగ్గా త్వరలోనే కోలుకుంటున్నారని చెప్పారని, ఇంతలో ఇలా జరగడం బాధాకరమని శేషు తెలిపారు. ఆయన భౌతికంగా లేకపోయినప్పటికీ ఆయన ఆశయాలు సజీవంగా ఉంటాయని, ఆయనలేని లోటు తమ కుటుంబానికి తీరని లోటు అని శేషు కన్నీటి పర్యంతం అయ్యారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article