మారుతున్న జీవనశైలి కారణంగా వీఐపీలు, సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లినా తమ రక్షణ కోసం ప్రైవేటుగా బౌన్సర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే బౌన్సర్లు అంటే వ్యక్తిగత బాడీగార్డులు. సెలబ్రిటీలతో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా బౌన్సర్లను నియమించడం సర్వసాధారణంగా మారిపోయింది. బౌన్సర్ల మెయిన్ డ్యూటీ .. వారిని నియమించుకున్న సెలబ్రిటీల వైపు ఎవరూ రాకుండా రక్షణగా ఉండటం. ఒకవేళ అలా కాదని ఎవరైనా వారి వైపు వస్తే వారిని ఎత్తిపడేస్తారు. ఇదిలా ఉంటే సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వివిధ పోటీలు జరిగాయి. అయితే ఓ పందెం బరి వద్ద బౌన్సర్లు సందడి చేశారు. బౌన్సర్లు సందడి చేయడం ఏంటా అని ఆలోచిస్తున్నారా.?
ఎందుకంటే అక్కడ ఏర్పాటు చేసింది మహిళా బౌన్సర్లను కాబట్టి. ఎప్పుడు ఎక్కడా చూడని విధంగా మహిళా బౌన్సర్లను చూసిన పందెం రాయుళ్లు వారి వీడియోలను తీసి తెగ వైరల్ చేసేస్తున్నారు మరి. తాడేపల్లిగూడెంలో పైబోయిన వెంకటరామయ్య పందాల బరి వద్ద నిర్వాహకులు లేడి బౌన్సర్లను ఏర్పాటు చేశారు. బౌన్సర్ అంటే ఆరడుగుల ఎత్తు, కండలు తిరిగి మంచి శరీర పుష్టి కలిగి చూడగానే బాబోయ్ అనేలా ఉంటూ ఎవరినైనా ఎత్తి పడేసేలా ఉంటారు. అయితే ఇక్కడ పందాల బరి వద్ద వెరైటీగా లేడీ బౌన్సర్లను ఏర్పాటు చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ లేడీ బౌన్సర్లు సైతం అందరినీ కంట్రోల్ చేస్తూ తమకు అప్పగించిన డ్యూటీని చక్కగా నిర్వహించారు. ఎప్పుడూ చూడని విధంగా అందులోనూ పందెం బరుల వద్ద లేడీ బౌన్సర్లు స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉండడంతో ఇప్పుడు ఆ వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.