బీటలు వారుతున్న కంచుకోట.. దండకారణ్యంలో ఆఖరి మజిలీ..!

2 hours ago 2

భూస్వాములు, జమీందార్ల అరాచకాలు.. వారు చేయించిన వెట్టిచాకిరీ, అధికార మదం, అహంకారం, అణచివేత నుంచి పుట్టిందే నక్సలిజం. చారుమజుందార్‌ పిలుపుతో ఎంతోమంది రైతులు, యువకులు నక్సలిజం వైపు మళ్లారు. 1960, 1970ల్లో మావో సిద్ధాంతాలతో నక్సలిజం వైపు ఆకర్షితులైన వేలాది మంది యువకులు ఆయుధాలు పట్టారు. భూములు కాపాడుకోడానికి.. అస్థిత్వాన్ని నిలుపుకోడానికి, అణచివేతను ఎదుర్కోడానికి తూటాలు పేల్చారు. వేలాది మందిని చంపి.. జనంలో హీరోలయ్యే ప్రయత్నాలు చేశారు.

మావోయిస్టులకు పెట్టని కోట దండకారణ్యం

వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం కలిసి మావోయిస్టులను అణచివేయాలన్న ప్రయత్నాలు చేశాయి. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాయి. రకరకాల వ్యూహాలతో అన్నలను తుదముట్టించాలని చూస్తున్నాయి. కాని దండకారణ్యం కాపాడుతోంది. మావోయిస్టులకు పెట్టని కోటగా మారిన అడవి.. వారికి ఊపిరిలూదుతోంది. ఇక అన్నల పని అయిపోయింది అనుకున్నప్పుడల్లా.. పచ్చని అడవే.. ఎర్ర జెండాలకు కోటగా మారి.. ఆశ్రయమిచ్చి పోషిస్తోంది. నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు తలనొప్పిగా మారిన మావోయిస్టులకు ఈ దండకారణ్యం కోటగా మారింది. దీని చారిత్రక, భౌగోళిక, సామాజిక పరిస్థితులేంటో తెలుసుకుందాం..!

చాపకింద నీరులా పాకిన మావోయిజం

జానపదాలు, సామాజిక సమస్యలతో కూడిన పాటలు విని.. ఉద్యమానికి ఆకర్షితులైన వారు ఎంతోమంది ఉన్నారు. అడవుల్లో అన్నలతో కలిసి ఉద్యమంలో పాల్గొని హీరోలుగా మారాలని ఉవ్విళ్లూరిన యువత ఉంది. మావో రచనలు.. సాయుధ పోరాటాలు, విప్లవ గీతాలు ఇలా ఎన్నో ఫ్యాక్టర్స్‌ ఒకప్పటి యువతను తమవైపు ఆకర్షితమయ్యేలా చేశాయి. అందుకే మావోయిజం చాపకింద నీరులా పాకింది. 1970 నుంచి 2000 సంవత్సరం వరకు ఉవ్వెత్తున ఎగసింది. పశ్చిమ బెంగాల్‌, ఒడిషా, ఉమ్మడి మధ్యప్రదేశ్‌, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను వణికించాయి. ఎంతలా అంటే.. నక్సలైట్లు హైదరాబాద్‌ వచ్చిమరీ గ్రేహౌండ్స్‌ని స్థాపించిన ఐపీఎస్‌ వ్యాస్‌ను అంతమొందించారు. అప్పుడు పీపుల్స్‌వార్‌లో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ నయీం ఈ పనిచేసి హీరో అవ్వాలని చూశాడు. ఆతర్వాత జరిగిన పరిణామాల్లో పీపుల్స్‌ వార్‌ తుడిచిపెట్టుకుపోయింది. అది కాస్తా మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందింది.

ప్రజాసమస్యలు తీర్చేందుకు రక్తపాతం

నక్సలిజం అయినా.. మావోయిజం అయినా.. ఒకటే పంథా.. ప్రజాసమస్యలు తీర్చేందుకు రక్తపాతాన్ని సృష్టించారు. నాయకులను చంపారు, భూసాములు, ఆసాములను అంతమొందించారు, పోలీసులను మట్టుబెట్టారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌లను సైతం ప్రాణాలు తీసే వరకు వదల్లేదు. ఇది ప్రజా ఉద్యమమా? తీవ్రవాదమా అన్నట్లుగా తయారైంది పరిస్థితి. కొందరు ప్రజలు కోసం పోరాడితే.. ఇంకొందరు తుపాకీ మీద మోజుతో అడవుల్లోకి వెళ్లారు. ఒకానొక సమయంలో మావోయిజం ప్రజలనే భయపెట్టింది.

మావోయిస్టుల ఏరివేతకు ఎన్నో ప్రయత్నాలు

ఎన్నికలు నిర్వహించాలంటే అటు అధికారులకు, పోటీ చేయాలంటే ఇటు ప్రజలకు తలనొప్పిలా మారింది. ఇలాంటి అవాంతరాల వల్ల ప్రభుత్వాలు మావోయిస్టుల ఏరివేతకు ఎన్నో ప్రయత్నాలు చేశాయి. ఐదు రాష్ట్రాల్లో పాతుకుపోయి ఉగ్రరూపంలో ఉన్న ఉద్యమాన్ని అణచివేసేందుకు చిత్తశుద్ధితో ముందడుగు వేశాయి. 2004లో అప్పటి సీఎంగా వైఎస్సార్‌ పదవి చేపట్టిన తర్వాత.. కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండడంతో మావోయిస్టులను అణచివేయడానికి మరిన్ని నిధులు రాబట్టగలిగారు. 2006లోనే 2వేల కోట్ల రూపాయలతో అత్యాధునిక ఆయుధాలు గ్రేహౌండ్స్‌కు ఇప్పించారు. అంతేకాదు ఆర్మీసాయం కూడా తీసుకునేందుకు అనుమతులు తెచ్చుకున్నారు. పలు ఆపరేషన్ల తర్వాత ఉమ్మడి ఏపీ నుంచి మావోయిస్టులు దాదాపు బోర్డర్‌ దాటి వెళ్లిపోయారు. కొన్ని ఏళ్ల ముందు ములుగు జిల్లాలో ఉన్న బొగత జలపాతం ప్రపంచానికి తెలుసా? అప్పట్లో ఈ జలపాతాన్ని కూడా మావోయిస్టులు డెన్‌గా వాడుకున్నారు. ఇప్పుడిప్పుడే జనాలు అక్కడకు వెళ్తున్నారు. అటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా ప్రభుత్వాలు కూడా మావోయిస్టులను అణచివేస్తూ వస్తుండడంతో వారి బోర్డర్స్‌ అన్నీ కుదించుకుపోయాయి. కాని ఆ ఒక్క ప్రాంతం మాత్రం పెట్టని కోటగా మారింది. అదే దండకారణ్యం.

అండగా నిలిచిన గిరిజనులు

సెంట్రల్‌ ఇండియాలో ఉన్న దండకారణ్యం అంటే.. మావోయిస్టులకు పెట్టని కోట. తెలంగాణ బోర్డర్‌లో ఉన్న గోదావరి నది నుంచి.. ఒడిశాలో ఉన్న మహానది వరకు.. ఏపీ-ఒడిశా బోర్డర్‌లో ఉన్న కొరాపుట్‌ నుంచి మధ్యప్రదేశ్‌లోని చంద్రపూర్‌ వరకు విస్తరించి ఉంది. నిజానికి ఈ ప్రాంతం మొత్తం గిరిజన జాతుల వారు నివసిస్తుంటారు. లంబాడీ, కోయ, గోండు, చెంచు, శంతల, సౌర, భూమిహార్‌, కొండ రెడ్లు ఇలా 32 జాతులకు చెందిన గిరిజనులు ఉన్నారు. వీరికి అడవే ఆధారం. ఇక్కడే వారి జీవనపోరాటం. అడవిని వదిలి బయటకు వెళ్లే పరిస్థితి లేదు. అయితే కొన్ని దశాబ్దాల క్రితం ఈ అడవులను చేజిక్కించుకునేందుకు ఎంతోమంది ప్రయత్నాలు చేశారు. దండకారణ్యంలో దొరికే సంపద కోసం గిరిజనులను పారదోలేందుకు స్కెచ్‌లు గీశారు. కాని మావోయిస్టులకు వారికి అండగా నిలిచారు. నిజంగా అండగా నిలిచారన్నదాని కంటే.. క్విడ్‌ ప్రో కో లాంటి ఒప్పందం జరిగిందనే చెప్పాలి. తాము బతకాలంటే గిరిజనుల అండ కావాలి. అటు గిరిజనులదీ అదే పరిస్థితి. దీంతో మీరు మాకు సహకరించండి.. మేము మీకు సహకరిస్తాం అన్నట్లుగా మారింది దండకారణ్యంలో పరిస్థితి.

గిరిజనులు, మావోయిస్టులకు మధ్య క్విడ్‌ ప్రో కో

ఇక్కడ బొగ్గు, ఐరన్‌ ఓర్‌, మాంగనీస్‌, బాక్సైట్‌, రాగి, సీసం వంటి విలువైన ఖనిజ సంపద ఉంది. ఇక సారవంతమైన ప్రదేశాలు, నదులు, జలపాతాలు ఇలా అపారమైన ప్రకృతి సంపద కూడా ఉంది. వీటన్నింటికి కాపాడడానికి కాపరులుగా గిరిజనులు.. వారికి బాడీ గార్డులుగా మావోయిస్టులు నిలిచారు. పోలీసులు గ్రామాల్లోకి ప్రవేశించిన వారిని చిత్రహింసలు పెట్టినా మావోయిస్టుల గురించి ఒక్క ముక్క కూడా బయటకు చెప్పేవారు కాదు. అలా అని పోలీసుల ఆగడాలకు చెక్‌ పెడతూ అడవిలో అన్నలు వివిధ మార్గాల్లో వారిని నిలువరించేవారు. తుపాకులు, మెషీన్‌గన్‌లు, గ్రెనెడ్‌లు, ల్యాండ్‌మైన్లు, క్లేమోర్‌ మైన్లు, రాకెట్‌లాంచర్లు ఇలా ఎన్నో ఆయుధాలను సమకూర్చకుని.. దండకారణ్యాన్ని ఏలుతూ వచ్చారు.

ఆపరేషన్‌ సమాధాన్‌

20 ఏళ్లుగా అబూజ్‌మఢ్‌ అడవులను ఏలుతూ వచ్చారు మావోయిస్టులు. మారణహోమాలను సృష్టించారు. పోలీసులు, జవాన్ల ప్రాణాలను తీశారు. గతంలో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేతకు ఒకడుగు ముందుకు వేస్తే.. 11 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రెండడుగులు ముందుకేసింది. దశాబ్దాల క్రితం సల్వాజుడుం ఫెయిల్యూర్‌ మోడల్‌గా మారడంతో.. కేంద్రం మరో ఎత్తు వేసింది. ఆపరేషన్‌ సమాధాన్‌తో ముందుకొచ్చింది. రాజ్‌నాథ్‌ సింగ్ హోంమంత్రిగా ఉన్నపుడు ఈ సమాధాన్‌ను లాంచ్‌ చేశారు. కాని మావోయిజాన్ని అంతమొందించలేకపోయారు. దీనికి కారణం మావోయిస్టులకు ఉన్న బలమైన నెట్‌వర్క్‌. దండకారణ్యంలో చీమ చిటుక్కుమన్నా వారికి తెలిసిపోతుంది. ఎక్కడ పోలీసుల అలికిడి ఉందో.. ఎటువైపు వెళ్తే సేఫ్‌గా బయటపడగలమో అణువణువూ వారికి తెలుసు.

చాకచక్యంగా తప్పించుకున్న ఆగ్రనేతలు

కొన్నేళ్ల క్రితం ఆంధ్రాఒరిస్సా బోర్డర్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌ తర్వాత అంతా అయపోయిందనుకున్నారు. అగ్రనేతలంతా దొరికిపోయారనే భావించారు. కాని వారు స్పాట్‌ నుంచి చాకచక్యంగా తప్పించుకున్నారు. వారిలో మావోయిస్టు అగ్రనేతలు ఆర్కే, చలపతి, జగన్‌ ఉన్నారు. ఇలా పటిష్టమైన నెట్‌వర్క్‌ వల్లే వారు తప్పించుకోగలిగారు. గిరిజనులతో మమేకమై.. ఇన్‌ఫార్మర్లతో ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటూ ముందుకు వెళ్లారు మావోయిస్టులు.

ఆయుధాల కోసం అండర్‌ గ్రౌండ్‌ టన్నెల్స్‌

వారు ఎక్కడ ఎలాంటి బాంబులు అమర్చారో తెలియని పరిస్థితి ఉండేది. ఎక్కడ కాలు పెడితే మైన్లు పేలతాయో అర్ధంకాని స్థితిలో పోలీసులు ఉండేవారు. అంతేకాదు.. తమ డంప్‌ను పదిలంగా ఉంచడానికి ఎన్నో అండర్‌గ్రౌండ్‌ టన్నెల్స్‌ను ఏర్పాటు చేసుకున్నారు. భారీగా ఆయుధాలను స్వయంగా తయారు చేసుకున్నారు. గతంలో పోలీస్‌ స్టేషన్ల మీద పడి ఆయుధాలు దొంగిలించే మావోయిస్టులు.. ఆతర్వాత స్వయంగా తయారు చేసుకుని ఆయుధాగారాన్ని పెంపొందించుకున్నారు. అలా దండకారణ్యంలో అడుగు పెడితే ప్రాణాలపై ఆశలు వదిలేసుకోడమే అన్న పరిస్థితికి వచ్చారు పోలీసులు.

ఆపరేషన్‌ కగార్‌ సక్సెస్

అయితే మోదీ ప్రభుత్వం నెట్‌వర్క్‌లను కట్‌ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. చట్టాలను మార్చింది. ఉపా చట్టంలో ఎన్నో సవరణలు తీసుకొచ్చి ఒక్కొక్కరిని వేరుచేస్తూ.. ఇన్‌ఫార్మర్లను తెంచేస్తూ పోయింది. ఆతర్వాత ఆపరేషన్‌ కగార్‌ పేరుతో మావోయిస్టులపై గ్రాండ్‌ స్కేల్‌లో ఎటాక్స్‌ చేపట్టింది. జిల్లా స్థాయిల్లో అధికారులను బలపర్చింది. కలెక్టర్లు, ఎస్పీలు, డీఎస్పీలు, సీఐ, ఎస్సైలతో సహా అందర్నీ మార్చేసింది. దీంతో గ్రౌండ్‌లో మరింత క్లియరెన్స్‌ దొరికింది. దూకుడుగా ఉండే అధికారులను నియమించడం వల్ల ఇన్‌స్టాంట్‌ ఎటాక్స్‌ చేయడానికి వీలుపడింది. ఇన్‌ఫార్మర్ వ్యవస్థను నాశనం చేయడమేకాదు.. తమ కోవర్టు వ్యవస్థను విస్తరించడం ద్వారా అన్నలకు ఎక్కడికక్కడ చెక్‌ పెడుతూపోయారు. 650 క్యాంపులతో నిఘావ్యవస్థ ఏర్పాటు చేసి ‘ఆపరేషన్‌ కగార్‌’తో పైచేయి సాధిస్తూ వెళ్లారు. ఏడాది వ్యవధిలో 300 మంది మావోయిస్టులను అంతం చేశారు. దీని ద్వారా మిగిలిన వారికి తీవ్ర హెచ్చరికలు పంపుతున్నారు.

ప్రత్యక్ష ఎన్‌కౌంటర్లలో అగ్రనేతల హతం

20 ఏళ్లుగా అబూజ్‌మఢ్‌ కేంద్రంగా ఏకఛత్రాధిపత్యంగా దండకారణ్యాన్ని కంచుకోటగా మలచుకున్న మావోయిస్టులు ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కేంద్ర కమిటీ సభ్యులు సైతం ప్రత్యక్ష ఎన్‌కౌంటర్లలో చనిపోతున్నారు. దండకారణ్యం, డీవీసీఎం కమిటీ సభ్యులదీ అదే పరిస్థితి. ఎండాకాలం వస్తే.. ఆకురాలిపోయి, బలగాల డ్రోన్‌ కెమెరాలకు చిక్కే ప్రమాదం.. టన్నెల్స్‌లోనూ ఉండలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎక్కడ తలదాచుకోవాలో తెలియని దుస్థితి..! లొంగిపోయిన నక్సలైట్లను పోలీసులు డీఆర్‌జీ పేరుతో బలగాలుగా మారుస్తూ.. మావోయిస్టులపై ఆయుధాలుగా మలచుకుంటున్నారు. వారు ఇచ్చే సమాచారంతో.. అడవుల్లో వారినే ముందుకు నడుపుతూ నక్సల్స్‌పై ‘ఆపరేషన్‌ కగార్‌’ పేరుతో వేట సాగిస్తున్నారు. బస్తర్‌లోని 7 జిల్లాల్లో సుమారు 8 వేల మంది డీఆర్‌జీ బలగాలను నియమించారు. వీరితోపాటు.. సీఆర్పీఎఫ్‌, కోబ్రా బలగాలతో దండకారణ్యంలో 650కి పైగా బేస్‌ క్యాంపులను ఏర్పాటు చేశారు. మావోయిస్టుల కదలికలపై సమాచారం వచ్చిందే తడవుగా.. ఈ క్యాంపుల నుంచి బలగాలు కూంబింగ్‌కు వెళ్తుంటాయి. దీంతో ఇప్పుడు అబూజ్‌మఢ్‌ లాంటి నక్సల్స్‌ కంచుకోటల్లో బలగాలు పాగా వేస్తున్నాయి.

ఏడాది కాలంగా 300మంది మృతి

ఇలా గత ఏడాది ఆరంభం నుంచి 42 ఎన్‌కౌంటర్లు జరగ్గా.. 300 మందికి పైగా మావోయిస్టులు మృతిచెందారు. వీరిలో శంకర్రావు, సాగర్‌, నర్సింహారావు వంటి భారీ రివార్డులున్న నక్సలైట్లు కూడా ఉన్నారు. చలపతి ఇటీవలి ఎన్‌కౌంటర్‌లో చనిపోవడంతో మిగిలిన అగ్రనేతల్లో గుబులు మొదలైంది. మావోయిస్టు అగ్రనేత గణపతిపై రూ.2.52 కోట్ల రివార్డు ఉంది. మరో నేత కేశవరావు అలియాస్‌ బస్వరాజ్‌పై రూ.1.5 కోట్లు, గెరిల్లా యుద్ధ నిపుణుడు మాద్వి హిడ్మాపై రూ. కోటి రివార్డు ఉన్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి.

బీటలు వారుతున్న మావోయిస్టుల కంచుకోట

మావోయిస్టుల కోట బీటలు వారుతోంది. ఇన్నాళ్లూ వారికి పెట్టనికోటగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం.. క్రమంగా భద్రతా బలగాల అధీనంలోకి వస్తోంది. గత నాలుగు నెలల్లో ఈ ప్రాంతంలో మావోయిస్టు పార్టీకి వివిధ రూపాల్లో భారీ నష్టం వాటిల్లడమే ఇందుకు నిదర్శనం. నలువైపుల నుంచి చొచ్చుకొస్తున్న కేంద్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర భద్రతా బలగాలు మావోయిస్టులకు కంటి మీద కునుకులేకుండా చేస్తుండగా.. ఈ విపత్తు నుంచి బయటపడే మార్గాల అన్వేషణలో కేంద్ర కమిటీ తలమునకలైందని తెలుస్తోంది.

టెక్నాలజీ ముందు నిలవలేకపోతున్న మావోయిస్టు పార్టీ

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ భద్రతా బలగాలు వరుసపెట్టి దాడులు చేస్తున్నాయి. 14 మందితో కూడిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ఎక్కువ మంది వృద్ధాప్య సమస్యలతో సతమతం అవుతున్నారు. భద్రతా బలగాలు ఇలానే చొచ్చుకు వస్తే.. కేంద్ర కమిటీ సభ్యులను తరలించడానికి సురక్షిత స్థావరాల కోసం మావోయిస్టులు వెదుకుతున్నట్లు తెలుస్తోంది. భద్రతా బలగాల సాంకేతిక పరిజ్ఞానం ముందు మావోయిస్టు పార్టీ తట్టుకొని నిలబడగలరా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. శాంతి చర్చలు జరపాల్సిన చోట.. మారణహోమం చేయడం తగదన్న వాదనలు కూడా వస్తున్నాయి. బలగాలు వాడే సాంకేతిక పరిజ్ఞానం ఎలా ఉందంటే.. ఇటీవల ఎన్‌కౌంటర్లో మరణించిన చలపతి కథే ఇందుకు నిదర్శనం. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కావడంతో, చలపతికి రక్షణగా ఎప్పుడూ ఎనిమిది నుంచి 10 మంది సెక్యూరిటీ ఉండేది. చాలాసార్లు ఈయన పోలీసుల దాడి నుంచి తప్పించుకున్నాడు. కానీ ఈసారి మాత్రం పక్కా సమాచారంతో భద్రతా బలగాలు మావోయిస్టులను చుట్టుముట్టి కాల్పులకు దిగడంతో చలపతి చనిపోయాడు. ఈ ఎన్‌కౌంటర్‌కు ఒక సెల్ఫీ కారణమైంది. తన భార్య అరుణతో గతంలో సెల్ఫీ దిగారు చలపతి. 2016 మేలో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌ తర్వాత ఒక ఫోన్‌ పోలీసులకు దొరికింది. టెక్నాలజీ సాయంతో సెల్ఫీ దిగిన లొకేషన్‌ను డీకోడ్‌ చేశారు. ఫోన్‌లో దొరికిన ఇన్‌ఫర్మేషన్‌తోపాటు.. ఫొటో దిగిన సమాచారం కూడా ఇందుకు తోడ్పడడంతో చలపతి అడ్డంగా దొరికిపోయారు.

అంపశయ్యపై మావోయిజం

నిజానికి దండకారణ్యం మావోయిస్టులకు ఎన్నో ఇచ్చింది. ఆ అడవుల్లో వారికి తెలిసినన్ని దారులు ఎవరికీ తెలియవు. కాని బలగాలు అంతకు పై ఎత్తులు వేసి.. మావోయిస్టులను చుట్టుముట్టారు. ఇక వారికి చరమగీతం పాడడమే తరువాయి అంటోంది కేంద్రం. అంపశయ్యపై మావోయిజం ఉందని.. వచ్చే ఏడాది మార్చ్‌ కల్లా ఈ దేశంలో మావోయిస్టు అనేవాడే ఉండడంటోంది. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి ప్రజాసంఘాలు. మావోయిజం చచ్చిపోయింది అనుకున్నప్పుడల్లా ఫీనిక్స్‌ పక్షిలా తిరిగి ఎగరడాన్ని చూస్తూనే ఉన్నాం. ఈసారి కూడా అలానే జరుగుతుందా? లేక కేంద్రం పూర్తిగా ఉక్కుపాదం మోపుతుందా? అన్నదీ వేచి చూడాలి..!

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article