బెంగళూరు, ఫిబ్రవరి 5: భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. కుమారుడిని స్కూల్‌లో వదిలేందుకు వెళ్లిన భార్యను రోడ్డుపై 7-8 సార్లు పొడిచి చంపాడు. ఈ దారుణ సంఘటన బెంగళూరు శివారులోని అనేకల్ తాలూకాలోని వినాయకనగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
శ్రీగంగ (29), మోహన్ రాజు (32) ఇరువురూ బెంగళూరులోని హెబ్బగోడిలోని తిరుపాల్య నివాసితులు. వీరు ఏడు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఆరు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. సజావుగా సాగుతున్న వీరి కాపురంలో అనుమానం చిచ్చురేపింది. దీంతో భార్యపై అనుమానం పెంచుకున్న మోహన్ తరచూ శ్రీగంగ గొడవపడేవాడు. తన స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకుందని మోహన్ భార్యను అనుమానించసాగాడు. ఈ నేపథ్యంలో రెండు-మూడు సంవత్సరాలుగా దంపతులు గొడవ పడుతూనే ఉన్నారు. దీంతో భార్యాభర్తలు గత 8 నెలలుగా విడివిడిగా నివసిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల కుమారుడిని కలవడానికి మోహన్ రాజు రాత్రి వేళ శ్రీగంగ ఇంటికివచ్చాడు. దీంతో భార్యాభర్తల మధ్య మరోమారు గొడవ జరిగింది.
ఆ మరుసటి రోజు ఉదయం శ్రీగంగా తన కుమారుడిని స్కూల్‌లో దింపడానికి బైక్ మీద వచ్చింది. అయితే ఆమె కోసం అక్కడే వేచి ఉన్న భర్త మోహన్ ఆమెపై దాడి చేశాడు. తనతోపాటు తెచ్చుకున్న కత్తితో శ్రీగంగను ఏడు-ఎనిమిది సార్లు పొడిచాడు. తీవ్రంగా గాయపడిన శ్రీగంగను స్థానికులు నారాయణ హెల్త్ సిటీ ఆసుపత్రికి తరలించారు. కానీ ఆమె అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. సమాచారం అందుకున్న హెబ్బగోడి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు మోహన్ రాజును అరెస్టు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.