భారత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ తన వాణిజ్య ఆదాయంలో 10% ను తన రిషబ్ పంత్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ టీమిండియాకు కీలక ఆటగాడిగా కొనసాగుతున్న ఈ స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్, రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తరఫున ముఖ్యమైన పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నాడు. క్రికెట్‌తో పాటు ఇతర సమాజ హిత అంశాల్లో కూడా తన పాత్రను విస్తరించాలనే లక్ష్యంతో ఈ గొప్ప నిర్ణయం తీసుకున్నాడు.
ఈ విషయాన్ని ప్రకటిస్తూ రిషబ్ పంత్ మాట్లాడుతూ, “నేను క్రికెట్ వల్లనే ఈ స్థాయికి చేరుకున్నాను. ఈ క్రీడ నాకు అందించిన ప్రతిదానికి కృతజ్ఞతగా, సమాజానికి తిరిగి అందించాలనే ఆలోచన నా మనసులో ఉంది. అందుకే, నా వాణిజ్య సంపాదనలో 10% ను రిషబ్ పంత్ ఫౌండేషన్‌కు అంకితం చేస్తున్నాను. చాలా ఉత్సాహంగా ఉన్నాను, త్వరలో నా ప్రణాళికల గురించి మరిన్ని వివరాలు అందరికీ తెలియజేస్తాను” అని చెప్పాడు.
2017లో భారత జట్టులో అరంగేట్రం చేసిన రిషబ్ పంత్, వన్డేలు, టెస్టులు, టీ20లు అనే తేడా లేకుండా అన్ని ఫార్మాట్లలోనూ అసాధారణ ఆటతీరును ప్రదర్శిస్తూ, టీమిండియాకు కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఇప్పటివరకు 150 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అతను, గత ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో భాగంగా ఉండి, 11 సంవత్సరాల నిరీక్షణకు ముగింపు పలికాడు.
టెస్టుల్లో అయితే రిషబ్ ప్రత్యేకమైన గుర్తింపును సాధించాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాల్లో వికెట్ కీపర్‌గా సెంచరీలు చేసిన అరుదైన భారత క్రికెటర్‌గా నిలిచాడు. అతని ధైర్య సాహసాలు భారత జట్టుకు ఎన్నో విజయాలను అందించాయి.
IPL చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు:
ఇటీవల జరిగిన IPL మెగా వేలంలో రిషబ్ పంత్ అత్యధిక ధరకు అమ్ముడైన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. లక్నో సూపర్ జెయింట్స్ అతని సేవలను పొందేందుకు ఏకంగా రూ. 27 కోట్లు వెచ్చించి, అతడిని ఫ్రాంచైజీ కెప్టెన్‌గా కూడా నియమించింది. అంతకు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు నాయకత్వం వహించిన అనుభవం ఉన్న రిషబ్, టీ20 ఫార్మాట్‌లో భారత జట్టును కూడా ముందుండి నడిపించిన అనుభవం కలిగి ఉన్నాడు.
క్రికెట్‌లో రికార్డులను సృష్టిస్తున్న రిషబ్, ఇప్పుడు సమాజానికి తన వంతు సహాయంగా రిషబ్ పంత్ ఫౌండేషన్ ద్వారా సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు. రాబోయే రెండు నెలల్లో ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలను ప్రకటించనున్నాడు. ఆటతోపాటు సేవా దృక్పథంతో ముందుకు సాగుతున్న రిషబ్ పంత్, క్రీడా ప్రపంచంలోనే కాకుండా సమాజంలో కూడా ప్రేరణగా నిలుస్తున్నాడు.
#RishabhPantFoundation #RP17 pic.twitter.com/WV45tNDI3g
— Rishabh Pant (@RishabhPant17) February 5, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..