సూరత్, ఫిబ్రవరి 5: పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని అంటారు. అది ఒకప్పటి మాట. ఈ మధ్య జరుగుతున్న పెళ్లిళ్లు మాత్రం ఖచ్చితంగా అందుకు విరుద్ధమని ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటారా? కట్నం తక్కువ అయిందని కొందరు, అబ్బాయికి సరైన ఉద్యోగం లేదని కొందరు, పెళ్లిలో మర్యాద ఇవ్వలేదని కొందరు.. ఇలా చిన్నాచితకా సమస్యలకు కూడా పెళ్లిని అమాంతం రద్దు చేసుకున్న సంఘటనలు గతంలో చాలానే చూశాం. ఇప్పుడు అదే కోవకు చెందిన మరో పెళ్లి తతంగం వెలుగులోకి వచ్చింది. అది ఏంటో.. ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
గుజరాత్ రాష్ట్రం సూరత్‌లో ఓ వివాహం జరుగుతుంది. వరుడు, వధువు ఇష్టంగా పెళ్లి పీటలు ఎక్కారు. వచ్చిన బంధువులు, సన్నిహితులు అంతా సరదాగా గడుపుతున్నారు. పెళ్లి వేడుకను ఆస్వాదిస్తున్నారు. అంతా బాగానే ఉంది అనుకుంటుండగా.. ఇంతలో గొడవ మొదలైంది. తీరా ఏంటా, దేని కోసమా అని చూస్తే అది కాస్తా పెళ్లి భోజనాల గురించి. వివాదం ముదిరి ముదిరి పెద్ద గొడవలా మారుతుండడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. భోజనాలు సరిపోలేదని మొత్తానికి పెళ్లి కూడా రద్దు చేసుకున్నారు. నాటకీయ పరిణామాల మధ్య జరిగిన ఈ వివాహ వేడుకకు సంబంధించి పోలీసులు పూర్తి వివరాలు తెలియజేశారు.
వధూవరులు ఇద్దరూ బీహార్‌కు చెందినవారే. వరుడు రాహుల్ ప్రమోద్ మహతో అంజలి కుమారి అనే యువతితో స్థానిక లక్ష్మీ హాల్‌లో వివాహం నిశ్చయించారు. పెళ్లి వేడుక, ఆచారాలు నిర్వహిస్తూ ఉండగానే వరుడు రాహుల్ కుటుంబం అతిథులకు వడ్డిస్తున్న ఆహారం లేకపోవడంతో గొడవ మొదలైంది. పెళ్లికి వచ్చిన అతిథులను భోజనం పెట్టకుండా అవమానిస్తారా అంటూ వధువు తరపు వారు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో వరుడు తరపు కుటుంబ సభ్యుల ప్రవర్తనతో వధువు బంధువులు, కుటుంబ సభ్యులు నిరాశ చెందారు. దీంతో నేరుగా వారు పోలీసులను ఆశ్రయించి వరుడి కుటుంబంపై ఫిర్యాదు చేశారు. దీనిపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అలోక్ కుమార్ స్పందిస్తూ.. “చాలా వరకు ఆచారాలు పూర్తయ్యాయి. దండలు మార్చుకోవడం మాత్రమే మిగిలి ఉంది. పెళ్లిలో భోజనాలు లేకపోవడంతో రెండు కుటుంబాలు వాగ్వాదానికి దిగాయి. ఆ తర్వాత వరుడి తరపు వారు వివాహానికి వెళ్లడానికి నిరాకరించారు” అని తెలిపారు.
ఇవి కూడా చదవండి
కానీ, ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే.. వరుడు ప్రమోద్ తనను వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని, కానీ అతని కుటుంబం అంగీకరించడంలేదని వధువు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు వరుడి కుటుంబాన్ని పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. పోలీసులు వారికి నచ్చజెప్పడంతో వరుడి కుటుంబం తర్వాత వివాహానికి అంగీకరించింది. అనంతరం రెండు కుటుంబాలు వివాహ మండపానికి తిరిగి వస్తే మళ్లీ గొడవ జరిగే అవకాశం ఉందని వధువు ఆందోళన చేయడంతో.. పోలీస్ స్టేషన్‌లోనే మిగతా పెళ్లి తంతు నిర్వహించడానికి పోలీసులు అనుమతించడం కొసమెరుపు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.