నాన్ వెజిటేరియన్ లో చికెన్, మటన్ లివర్ ప్రత్యేక రుచి కారణంగా చాలా మంది తినడానికి ఇష్టపడుతారు. లివర్ ఫ్రై, లివర్ కర్రీ, లివర్ గ్రేవీ వంటివి ఇష్టంగా తింటుంటారు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు, నష్టాలను తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ లివర్ ప్రయోజనాలు
చికెన్ లివర్ అనేక పోషకాలకు అద్భుతమైన మూలం. ఇందులో ప్రోటీన్, ఐరన్, సెలీనియం, విటమిన్ బి12, ఫోలెట్, విటమిన్ ఎ అధికంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ బి12 మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే శక్తిని కలిగి ఉంది. సెలీనియం కేన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
చికెన్ లివర్ రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి ప్రయోజనం కలిగించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఫోలెట్ లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గుణాలను కలిగి ఉంటుంది. ఉడికించిన చికెన్ లివర్ తినడం వల్ల కొవ్వు శాతం తక్కువగా ఉండి బరువు పెరగకుండా ఉంటుంది.
మటన్ లివర్ ప్రయోజనాలు
మటన్ లివర్ అంటే కూడా చాలా మంది ఇష్టపడుతారు. ఇందులో విటమిన్ ఎ, డి, బీ12, ఐరన్, జింక్, పొటాషియం, రాగి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మటన్ లివర్ రక్తహీనతను నివారించడంలో శరీరంలోని ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరిచే పనితీరును అందిస్తుంది.
విటమిన్ బీ12 రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. మటన్ లివర్‌లో ఉండే ఖనిజాలు శరీర ఎంజైమ్ పనితీరును మెరుగుపరిచే శక్తిని కలిగి ఉంటాయి.
హానికరమైన విషయాలు
ఈ చికన్, మటన్ లివర్స్ ని అధికంగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. గుండె వ్యాధులు, కొలెస్ట్రాల్ సమస్యలు, ఫ్యాటీ లివర్ ఉన్నవారు లివర్ తో చేసిన వంటకాలను ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే కిడ్నీ వ్యాధులు ఉన్నవారు కూడా డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.
లివర్ తినే సరైన పద్ధతి
లివర్‌ను ఎక్కువగా ఫ్రై చేయకుండా ఉడికించి కూరగాయలతో కలిపి తినడం మంచిది. వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తినడం ఉత్తమం. మటన్ లివర్, చికెన్ లివర్ కంటే ఎక్కువ పోషకాలు కలిగి ఉన్నప్పటికీ లిమిటెడ్ గా తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)