1825లో డెన్మార్క్ శాస్త్రవేత్త మొట్టమొదటి సారిగా అల్యూమినియంను కనుగొన్నారు. 1938లో భారత్‌లో ఇండియన్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ ప్రారంభించడంతో దేశవ్యాప్తంగా దీని వినియోగం పెరిగిపోయింది. వాడకం సులభం, ధర తక్కువగా ఉండటం వల్ల మట్టి, ఇత్తడి, కంచు, రాగి పాత్రలను వదిలేసి ప్రజలు వీటిని ఎక్కువగా ఉపయోగించడం మొదలుపెట్టారు.
ఈ పాత్రల్లో వండిన ఆహారంలో అల్యూమినియం చిన్న మోతాదుల్లో కరిగిపోతుందని పరిశోధనలు చెబుతున్నాయి. దీర్ఘకాలంలో ఇది శరీరంలో పేరుకుపోతే ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా టమాట, చింతపండు, నిమ్మ వంటి పుల్లటి పదార్థాలతో వంట చేస్తే ఆహారంతో పాటు ఎక్కువ మోతాదులో అల్యూమినియం శరీరంలోకి చేరుతుంది.
ఆరోగ్యపరమైన ప్రమాదాలు
- శరీరానికి అవసరమైన ఐరన్, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాల స్థానంలో అల్యూమినియం ఎక్కువగా చేరితే రక్తహీనత సమస్య తలెత్తే అవకాశం ఉంది.
- శరీరంలో అధిక అల్యూమినియం పేరుకుపోతే ఎముకలు బలాన్ని కోల్పోతాయి. దీని వల్ల ఆస్టియోమలేషియా అనే వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది.
- అల్యూమినియం ఎక్కువగా చేరితే మెదడులో నాడీ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. దీర్ఘకాలంగా డయాలిసిస్ చేసుకునే రోగులకు ఇది మరింత ప్రమాదకరం.
- మెదడులో అల్యూమినియం నిల్వ ఉంటే అల్జీమర్స్, డిమెన్షియా వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
- కిడ్నీ వ్యాధులు ఉన్నవారికి ప్రమాదకరం
- మూత్రపిండాలు సరైన రీతిలో పని చేయని వారికి అల్యూమినియం మరింత ప్రమాదకరం. శరీరంలోకి వెళ్లిన అల్యూమినియం మూత్రపిండాల ద్వారా పూర్తిగా బయటకు వెళ్లకపోతే, అవయవాల్లో పేరుకుపోయే అవకాశం ఉంది. దీని వల్ల కిడ్నీ వ్యాధులు తీవ్రమవుతాయి.
సురక్షితమైన వంట పాత్రలు
- స్టెయిన్‌లెస్ స్టీల్ వంట పాత్రలు శరీరానికి హానికరం కాకుండా వంట చేసుకోవడానికి ఉత్తమమైనవి.
- పురాతన కాలం నుంచి వాడుతున్న మట్టి పాత్రలు రసాయన పూరితం కాకుండా ఉంటాయి.
- ఇవి మన ఆరోగ్యానికి హితమైనవి, కానీ శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం.
వైద్య నిపుణుల సూచనలను అనుసరిస్తే.. అల్యూమినియం పాత్రల వాడకాన్ని తగ్గించడం ఉత్తమం. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు వీటి వాడకాన్ని పరిమితం చేయడం మంచిది. ఆరోగ్యంగా ఉండటానికి మనం ఏం తింటున్నామో కాకుండా.. దాన్ని ఏ పాత్రలో వండుతున్నామో కూడా తెలుసుకోవాలి.