షార్‌లో సెంచరీ కొట్టేందుకు సిద్ధమయింది..ఇస్రో. శ్రీహరికోటలోని షార్ నుంచి తన వందో ప్రయోగమైన GSLV-F15 రాకెట్‌ను నింగిలోకి పంపనుంది..ఇస్రో. దేశీయంగా రూపొందించిన ఈ క్రయోజనిక్ రాకెట్ ద్వారా..NVS-02 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించనుంది. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్ మంగళవారం తెల్లవారుజామున 2 గంటల 53 నిమిషాలకు ప్రారంభమైంది.
27 గంటలపాటు ఈ కౌంట్‌డౌన్ కొనసాగుతుంది. బుధవారం ఉదయం 6 గంటల 23 నిమిషాలకు షార్‌లోని రెండో ల్యాంచ్‌ప్యాడ్ నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.GSLV-F15 రాకెట్ జీఎస్ఎల్వీ సిరీస్‌లో 17వది. దేశీయ క్రయోజెనిక్ స్టేజ్ ఉన్న 11వ రాకెట్. ఈ ప్రయోగం ద్వారా NVS-02 ఉపగ్రహాన్ని జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెడతారు. దీని ద్వారా దేశీయ నావిగేషన్ వ్యవస్థ నావిక్ మరింత విస్తృతం కానుంది. ఈ ఉపగ్రహం సెకండ్ జెనరేషన్ శాటిలైట్ కాగా..ఎన్వీఎస్-01 ఉపగ్రహాన్ని 29 మే 2023న ఇస్రో నింగిలోకి పంపింది. ఈ ఎన్వీఎస్-02 ఉపగ్రహం ఈ సిరీస్‌లో రెండో ఉపగ్రహం. ఇందులో ఎల్1, ఎల్5, ఎస్ బ్యాండ్లలో నావిగేషన్ పేలోడ్లతో పాటు సీబ్యాండ్ రేజింగ్ పేలోడ్స్ ఉంటాయి.