విదేశాల్లో విద్య, ఉపాధి అవకాశాలకోసం చాలా మంది ప్రయత్నిస్తున్నారు. వారిలో కొంతమందికి విజయవంతంగా వీసాలు వస్తే.. మరికొంతమందికి మాత్రం ఎన్నిసార్లు ప్రయత్నించినా వీసా దక్కడం లేదు. గత కొంతకాలంగా విదేశాల్లో పరిస్థితులు మారిపోవడం, మార్గదర్శకాలు, నిబంధనలు కఠినతరం కావడంతో వీసా రావడం మరింత క్లిష్టంగా మారింది. ఈ క్రమంలోనే విదేశాలకు వెళ్లి అక్కడ ఉద్యోగం చేయాలనుకున్న భర్త.. తనకు వీసా రాకపోవడంతో తన భార్యకైనా వీసా వస్తుందని ఆశించాడు. అయితే, ఆమెకు కూడా అవకాశం అంతగా లేకపోవడంతో ఏకంగా భార్యనే వదులుకునేందుకు సిద్దమయ్యాడు.
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఆరమండకు చెందిన మౌలా బాబుకు కట్టెంపూడికి చెందిన మౌళికకు రెండేళ్ల క్రితం వివాహమైంది. మౌలా బాబు బిటెక్ చదవగా మౌళిక ఎంబిఏ పూర్తి చేసింది. అయితే వివాహం అయిన తర్వాత కొద్దీ రోజుల్లోనే అస్ట్రేలియా వెళ్లి ఉద్యోగం చేయాలని బాబు ప్రయత్నాలు ప్రారంభించాడు.. అయితే బాబుకు విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశం రాలేదు. ఈ క్రమంలోనే ఎంబీఏ చేసిన మౌళికను వీసా కోసం ప్రయత్నించమని ప్రోత్సహించాడు. ఆమెకు వీసా వస్తే డిపెండెంట్ గా అక్కడకు తాను వెళ్లవచ్చని భావించాడు.
అయితే, అక్కడ పీజీ చేసేందుకు రెండు సార్లు ప్రయత్నించిన మౌళికకు మంచి స్కోర్ రాలేదు. మూడోసారి మంచి స్కోర్ వచ్చింది. అయితే ఈ మధ్యలో విజిటింగ్ వీసా కోసం రెండు సార్లు ప్రయత్నించగా రిజెక్ట్ అయింది. దీంతో మరో ఏడాది పాటు ఆమె అస్ట్రేలియా వెళ్లే అవకాశం లేకుండా పోయింది. ఈ క్రమంలో విదేశాలకు వెళ్లాలన్న తన ఆశలు అడియాసలు అయ్యాయన్న ఉద్దేశంతో బాబు ఆమె తల్లి మౌళికను కాపురానికి తీసుకెళ్లకుండా తాత్సారం చేస్తూ వస్తున్నాడు..
ఎన్నోసార్లు అత్త ఇంటికి వచ్చి వేడుకున్నా అత్తింటి వాళ్లు, భర్త కనికరం చూపలేదు. దీంతో మౌళిక నిన్నటి నుండి భర్త ఇంటి ముందు బైఠాయించి తనను కాపురానికి ఎందుకు తీసుకెళ్లడం లేదో చెప్పాలంటూ ఆందోళన చేస్తోంది. ఈ క్రమంలోనే భర్త, అత్త ఈ రోజు ఇంటికి తాళం వేసి ఎక్కడికో వెళ్లిపోయారు. తనకు విడాకులిచ్చి తన భర్తకు రెండో పెళ్లి చేసేందుకు అత్త సిద్దమయిందని మౌళిక ఆరోపిస్తుంది. ఈ ఘటనపై పోలీసులు కూడా ఆరా తీసినట్లు తెలుస్తోంది.. ఈ కేసును పోలీసులు ఏ విధంగా పరిష్కరిస్తారనేది తెలియాల్సి ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..