డీటాక్స్ చేయడం అంటే శరీరాన్ని శుభ్రపరచడం, విశ్రాంతినివ్వడం. మనం శరీరాన్ని బయటి నుండి మాత్రమే కాకుండా లోపల నుండి కూడా శుద్ధి చేయాలి. డీటాక్స్ చేయడం వల్ల వ్యాధుల ప్రమాదం తగ్గడంతో పాటు రక్తం శుద్ధి అవుతుంది. మలినాలు కూడా తొలగిపోతాయి. నీరసం, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, తలనొప్పి, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు ఉన్నప్పుడు శరీరాన్ని డీటాక్స్ చేయడం చాలా అవసరం.
పోషకాహారం
శరీరానికి పోషకాహారం చాలా ముఖ్యం. పోషకాహారం తీసుకుంటే శరీరం సహజంగానే డీటాక్స్ అవుతుంది. సేంద్రీయ, సహజ పద్ధతుల్లో పండించిన ఆహారం తీసుకోవాలి. నూనె, కారం, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తగ్గించాలి. సేంద్రియ పద్ధతిలో ఉత్పత్తి చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరం సహజంగా శుద్ధి అవుతుంది.
నీరు
శరీరాన్ని సహజంగా డీటాక్స్ చేయాలనుకుంటే రోజుకి తగినంత నీరు తాగాలి. నీరు ఎక్కువగా తాగితే బాడీలోని టాక్సిన్స్ మూత్ర రూపంలో బయటికి వెళ్తాయి. రోజుకి 5 నుండి 6 లీటర్ల నీరు తాగడం వల్ల బాడీలో పేరుకుపోయిన మలినాలు బయటికి వచ్చి శరీరం శుభ్రపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది సహాయపడుతుంది.
ఉపవాసం
మనం ప్రతిరోజు ఏదో ఒకటి తింటూ ఉంటాం. దీనివలన బాడీలో టాక్సిన్స్ పేరుకుపోతాయి. కాబట్టి బాడీ డీటాక్స్ అవ్వడానికి అప్పుడప్పుడు ఉపవాసం కూడా చేయాలి. ఒకటి రెండు రోజులు హెవీ మీల్స్ బదులు తేలికైన ఫుడ్ తీసుకోండి. ఈ సమయంలో పండ్లు, కూరగాయలు తినొచ్చు. దీనివలన రోజంతా తేలిగ్గా ఉండటమే కాకుండా కడుపు, జీర్ణ వ్యవస్థకి విశ్రాంతి ఇచ్చినట్టు అవుతుంది.
ఆకుపచ్చ కూరగాయలు
ఆకుపచ్చ కూరగాయలు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో బాడీ డీటాక్సీఫికేషన్ ఒకటి. ఆకుపచ్చ కూరగాయల్ని స్మూతీస్, సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు. బచ్చలికూర, పాలకూర, దోసకాయ వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవచ్చు. వీటితో పాటు క్యారెట్, బీట్‌రూట్ మొదలైనవి కూడా తీసుకోవచ్చు. వీటిలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి బాడీకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలని అందిస్తాయి.
హెర్బల్ డ్రింక్స్
హెర్బల్ డ్రింక్స్ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని తీసుకోవడం వల్ల బాడీ డీటాక్స్ అవుతుంది. బాడీలోని టాక్సిన్స్ బయటికి వెళ్లిపోతాయి. బాడీ డీటాక్స్ అవ్వటానికి గ్రీన్ టీ, హెర్బల్ టీ మొదలైనవి తీసుకోవచ్చు. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. బాడీ డీటాక్స్ అవ్వటానికి బ్లాక్ టీ కూడా చాలా మంచిది. మీరు ఈ టీలలో ఏదైనా ఒకటి రోజూ తీసుకోవడం మంచిది. ఒక్కొక్కటైనా తీసుకోవచ్చు. రోజూ రెండు కప్పుల టీ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.