ప్రస్తుత రోజుల్లో కల్తీకి కాదేది అనర్హం అన్నట్లుగా ఉంది పరిస్థితి. పాలలో చిక్కదనం కోసం పామాయిల్, ఉప్పు, మాల్టోడెక్సిన్ పౌడర్‌ను నీళ్లలో కలిసి.. తర్వాత ఆ మిశ్రమాన్ని పాలల్లో మిక్స్ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు కంత్రిగాళ్లు. అనంతపురం జిల్లాలో వెలుగులోకొచ్చిన ఈ ఘటన విస్తుపోయేలా చేస్తోంది. కెమికల్స్ కలిసిన కల్తీ పాలను అనంతపురం పరిసర ప్రాంతాల్లోని డెయిరీలకు సైతం సరఫరా చేస్తున్నట్లు తేలింది.
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బండమీదపల్లి గ్రామంలో పక్కా సమాచారంతో రంగంలోకి దిగారు విజిలెన్స్ అధికారులు. కల్తీ పాల తయారీ కేంద్రాలపై దాడులు చేపట్టారు. పాల చిక్కదనం కోసం వినియోగిస్తున్న మిశ్రమాలను స్వాధీనం చేసుకున్నారు. కల్తీ పాల తయారీ కేంద్రాలను సీజ్ చేశారు. టెస్ట్‌ల నిమిత్తం కల్తీ పాలను ల్యాబ్ పంపారు అధికారులు. రిపోర్ట్ ఆధారంగా చర్యలుంటాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇలా ఓ 100 మంది కల్తీ గాళ్లు ఇలా పాలను తయారు చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు.
అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అనంతపురం పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రజలందరూ తాగే పాలలో 80% కల్తీ పాలే తాగుతున్నారని విజిలెన్స్ అంఢ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నిర్ధారించారు. ఇళ్లకు వచ్చి పాలు పోసే వాళ్ల దగ్గర్నుంచి… పాల డైరీలో తయారై… బయటకు వచ్చే పాల ప్యాకెట్లు…. కూడా కల్తీ పాలే అని విజిలెన్స్ అధికారులు అంటున్నారు.
మొత్తంగా.. కల్తీ పాల ద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలు, క్యాన్సర్, మధుమేహం, పిల్లలలో ఎదుగుదలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వంటి జబ్బులు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు విజిలెన్స్ అధికారులు. బయట ఆహార పదార్థాలు కొనేటప్పడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..