ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో పౌల్ట్రీ రంగం అల్లాడిపోతుంది. కోళ్లు మృత్యువాత పడుతుండటంతో పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత 15 రోజుల్లో ఉమ్మడి జిల్లాలో 40 లక్షల కోళ్లు చనిపోయాయి. బాదంపూడి, రేలంగి, మొగల్లు, పెద్ద తాడేపల్లి, దువ్వ వేల్పూర్, తణుకు, గుమ్మనిపాడు ప్రాంతాలలో కోళ్లు ఎక్కువుగా చనిపోతున్నాయి. ఒక్కొక్క పౌల్ట్రీ ఫామ్ దగ్గర రోజుకు దాదాపు పదివేల కోళ్లు చనిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లక్షలాది కోళ్ల మృతితో పశు సంవర్ధన శాఖ అధికారులు రంగంలోకి దిగారు. శాంపిల్స్ సేకరించి భోపాల్‌లోని హై సెక్యూరిటీ ల్యాబ్ కు పంపారు. మరిన్ని కోళ్లకు వైరస్ సోకకుండా రైతులు చనిపోయిన కోళ్లను బహిరంగ ప్రదేశంలో పడేయకుండా పాతిపెట్టాలని సూచిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోళ్ల ఫారాలలో ఎనిమిది కోట్ల బ్రాయిలర్ కోళ్లు, ఇళ్లలో రెండు కోట్ల నాటు కోళ్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. దేశీయ కోళ్ల కంటే కోళ్ల ఫారం కోళ్లలోనే మరణాలు ఎక్కువగా ఉన్నాయి.
— ఇక తెలంగాణ విషయానికి వస్తే…
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో వేలాది బాయిలర్ కోళ్లు చనిపోతున్నాయి. అంతుచిక్కని వైరస్‌తో సత్తుపల్లి, కల్లూరు, విఎమ్ బంజరలోని పౌల్ట్రీ ఫామ్స్‌లో కోళ్లు చనిపోతున్నాయి. కోళ్ల మృతిపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర నష్టం వస్తుందని.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
అటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ అంతుచిక్కని వ్యాధితో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. బిర్కూర్, పోతంగల్, భీమ్‌గల్ మండలాల్లో వేలాది కోడి పిల్లలు చనిపోయాయి. వైరస్ ఒక్కొక్కటిగా.. అన్ని పౌల్ట్రీ ఫామ్స్‌కు వ్యాపిస్తుండటంతో.. తీవ్ర ఆందోళనలో ఉన్నారు పౌల్ట్రీ రైతులు. వైరస్ ఏంటో కనిపెట్టి.. దానికి సంబంధించిన వ్యాక్సిన్ పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..