ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తాం, వేలల్లో జీతాలు, ఆలకిస్తే ఆశాభంగం అని కల్లబొల్లి కబుర్లు చెప్పి నిరుద్యోగులకు టోకరా పెట్టారు ఘరానా మోసగాళ్ళు. యోగ టీచర్లుగా ఉద్యోగాలు ఇప్పిస్తామని కోట్లాది రూపాయల డబ్బు కాజేసి మొహం చాటేశారు నిర్వాహకులు. షేక్ సయ్యద్ వలి, వై. లక్ష్మీనారాయణరెడ్డి, ప్రసాద్ రెడ్డి అనే ముగ్గురు వ్యక్తులు బుద్ద యోగ హెల్త్ ఫౌండేషన్ అనే సంస్థ నిర్వహిస్తున్నారు. పాఠశాలల్లో యోగా టీచర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం నియామకాలు చేస్తుందని, తమకు చెందిన బుద్ధ యోగ హెల్త్ ఫౌండేషన్ కి ఆ బాధ్యతలు అప్పగించారని, అందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా విద్యాశాఖ కమీషనర్ విడుదల చేశారని నిర్వాహకులు 2022లో ప్రకటించారు. నియామకాల కోసం యోగ శిక్షణ ఉచితంగానే ఇస్తామని, యోగాలో ప్రావీణ్యం పొందిన తరువాత వారికి సర్టిఫికెట్స్ ఇచ్చి టీచర్స్ గా తీసుకుంటామని నమ్మబలికారు. అందుకు కొంత సొమ్ము చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు వస్తాయని ఆశపడిన నిరుద్యోగులు నిర్వాహకులు అడిగినట్లు ఒక్కొక్కరు రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఇచ్చారు. అనంతరం గుంటూరు, బ్రాడిపేట కార్యాలయంలో వారికి నియామక పత్రాలు కూడా అందించారు. తరువాత 45 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు.
ఆ శిక్షణ కోసం గుంటూరు పిలిచి అక్కడ హాస్టల్ ఫీజ్, ఇతర ఫీజులు అదనంగా వసూలు చేశారు. శిక్షణ పూర్తయిన తరువాత బాధితులకు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, బుద్ధ యోగా హెల్త్ ఫౌండేషన్ పేరిట ఐడీ కార్డులు ఇచ్చారు. తరువాత వీరిని కొన్ని ప్రభుత్వ పాఠశాలలో విధులకు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు బుద్ద యోగ హెల్త్ ఫౌండేషన్ పేరిట లేఖలు పంపారు. ఆ లేఖలను నమ్మిన అధికారులు శిక్షణ పొందిన నిరుద్యోగులను విధుల్లోకి తీసుకున్నారు. ఆ తరువాత బాధితులకు రెండు నెలలు జీతాలు కూడా చెల్లించి తరువాత జీతాలు నిలిపివేసారు నిర్వాహకులు. ఆ తర్వాత ఎన్ని నెలలు ఉద్యోగాలు చేసినా జీతాలు రాకపోవడంతో నిర్వాహకులకు ఫోన్లు చేశారు బాధితులు. ఆ సమయంలో వారి ఫోన్లు స్విచ్ఛాప్ రావడంతో తాము నష్టపోయామని పోలీసులను ఆశ్రయించారు బాధితులు.
రాష్ట్ర వ్యాప్తంగా భాదితులు వెయ్యి మందికి పైగానే ఉన్నారు. ఈ క్రమంలో బాధితుల ఫిర్యాదు మేరకు 2024 మే నెలలో నిర్వహకుల పై కేసు నమోదు చేశారు పోలీసులు. విషయం తెలుసుకున్న నిందితులు తమ పై నమోదైన కేసు పై హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు నిందితులకు 41ఏ నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని టూ టౌన్ పోలీసులకు సూచించింది. హైకోర్టు ఆర్డర్ రావడంతో నిందితులు సినిమా స్టైల్లో బౌన్సర్ల సహాయంతో విజయనగరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. అయితే నిందితులు టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న శ్రీకాకుళం, విజయనగ రం, విశాఖ తదితర జిల్లాలకు చెందిన బాధితులు పెద్దఎత్తున పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. నిందితులు అప్పటికే స్టేషన్ లో ఉండటంతో తమకి న్యాయం చేయాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. మోకాళ్ల పై కూర్చొని నిరసన తెలిపారు. బుద్ద యోగ హెల్త్ ఫౌండేషన్ సంస్థ చేతిలో మోసపోయిన భాదితులు సుమారు వెయ్యి మందికి పైగానే ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే నిందితులు ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో బాధితులకు ఏ మేరకు న్యాయం జరుగుతుందో చూడాల్సి ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి