పోలీస్ అధికారులు ఎంత అవగాహన కల్పించిన సైబర్ నేరగాళ్ల కొత్త కొత్త టెక్నిక్ లకు అమాయకులు చిక్కుతూనే ఉన్నారు. అరెస్ట్ పేరిట.. పదకొండు లక్షల రూపాయల రుణం ఇప్పించి.. ఆ రుణాన్ని కొట్టేసిన సైబర్ నేరగాళ్లపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు సైబర్ నేరగాళ్ల కోసం ప్రత్యేక గాలింపు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా నర్సరావుపేట పెద చెరువుకు చెందిన సత్య శ్రీ సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుంది.
శనివారం మధ్యాహ్నం సత్య శ్రీకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. తాము నార్కోటిక్స్ అధికారులమని చెప్పుకున్న సైబర్ నేరగాళ్లు.. సత్యశ్రీకి ఒక పార్శిల్ వచ్చిందని ఆ పార్శిల్లో గంజాయి ఉందని చెప్పారు. దీంతో కంగారు పడిన సత్య శ్రీ తనకు ఆ పార్శిల్ కు సంబంధం లేదని చెప్పింది. అయినా వాళ్లు వినకుండా గంజాయి కేసు పెడితే లైఫ్ నాశనం అవుతుందని బెదిరించారు. కేసు పెట్టకుండా ఉండాలంటే పది లక్షల ఇవ్వాలని కూడా చెప్పారు. అయితే తన వద్ద అంత డబ్బు లేదని ఏదో చిన్న జాబ్ చేసుకుంటున్నానని సత్య శ్రీ తెలిపింది. అయితే బ్యాంక్ లో రుణం తీసుకొవాలని వాళ్లు సూచించారు.
నువ్వు చేస్తున్న జాబ్ ప్రకారం పది లక్షల వరకూ రుణం బ్యాంక్ ఇస్తుందని.. ఎవరికి అనుమానం రాకుండా లోన్ తీసుకోవాలని తెలిపారు. దీంతో సత్యశ్రీ ప్రైవేటు బ్యాంక్ ను ఆశ్రయించింది.. వెంటనే ఆన్ లైన్‌లో సంప్రదించి.. పదకొండు లక్షల రూపాయల రుణం పొందింది.
ఆ తర్వాత నార్కోటిక్ అధికారుల పేరుతో మరోసారి ఫోన్ చేసి కేసు పెడతామని బెదిరించి.. ఆ పదకొండు లక్షల రూపాయలను తమ ఖాతాలకు మళ్ళించుకున్నారు. అయితే ఆ తర్వాత తాను మోస పోయినట్లు గ్రహించిన యువతి పోలీసులను ఆశ్రయించింది. ఇదంతా సైబర్ నేరగాళ్ల పనేనని గ్రహించిన పోలీసులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.