ఢిల్లీ ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. ప్రధాని మోదీ బీజేపీ అభ్యర్ధుల తరపున ప్రచారం చేశారు. ఆర్‌కే పురం సభలో ఆమ్ ఆద్మీ పార్టీపై విరుచుకుపడ్డారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్ధులను పరిచయం చేశారు మోదీ. ఢిల్లీలో సోమవారంతో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ఈ సభతో ముగించారు మోదీ. 11 ఏళ్ల ఆప్ పాలనలో ఢిల్లీ సర్వనాశనమయ్యిందన్నారు.
ఓటర్లకు వసంతపంచమి శుభాకాంక్షలు తెలిపారు మోదీ.. ఢిల్లీ ప్రజలకు కూడా త్వరలో వసంతం రానుందని , బీజేపీ అధికారం లోకి రాగానే ప్రజల కష్టాలు తీరుస్తామన్నారు. పొరపాటున ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేస్తే కష్టాలు కొనితెచ్చుకున్నట్టే అవుతుందన్నారు . ఆప్ ఓటర్లకు తప్పుడు హామీలు ఇస్తుందని మండిపడ్డారు.
కేంద్ర బడ్జెట్‌తో మధ్యతరగతి ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారని అన్నారు మోదీ.,. మిడిల్‌క్లాస్ కోసం తమ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చినట్టు చెప్పారు. జనతా జనార్ధన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టామన్నారు. వ్యాపారుల ఆదాయం రెట్టింపు అవుతుందన్నారు.
అటు అరవింద్ కేజ్రీవాల్‌పై కేంద్రహోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. కేజ్రీవాల్ ఒక అబద్ధాలకోరు అంటూ అమిత్ షా విమర్శించారు. ఢిల్లీ ప్రజలను కేజ్రీవాల్ మోసం చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సమీపంలోని 360 గ్రామాల ప్రతినిధులతో అమిత్ షా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. 360 గ్రామాల ప్రజల మద్దతు తమకే ఉందన్నారు అమిత్ షా.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..