తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించిన ఘటనపై ఇవాళ్టి నుంచి జ్యుడీషియల్ ఎంక్వైరీ ప్రారంభం కానుంది. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తి నేతృత్వంలోని కమిషన్ తొక్కిసలాట ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపనుంది. ఆరునెలల్లోగా నివేదిక సమర్పించాలని కమిషన్‌కు ప్రభుత్వం సూచించింది. టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టోకెన్ల జారీ క్యూలైన్‌లో ఆరుగురు మరణించారు.
జనవరి నెల 8వ తేదీన జరిగిన ఈ తొక్కిసలాట ఘటనను తీవ్రంగా పరిగణించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హుటాహుటిన తిరుపతి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఇద్దరు అధికారుల సస్పెన్షన్, ముగ్గురు అధికారుల బదిలీలు చేశారు. బాధిత కుటుంబాలకు టీటీడీ తరఫున నష్టపరిహారం సైతం చెల్లించారు. ఈ ఘటనపై మాజీ న్యాయమూర్తితో విచారణకు ఆదేశించారు. తిరుపతిలోని పద్మావతి పార్క్ వద్ద జరిగిన తొక్కిసలాటలో వైకుంఠ ఏకాదశి దర్శనానికి టోకెన్ల కోసం ఎదురుచూస్తున్న ఆరుగురు భక్తులు మరణించడానికి దారి తీసిన పరిస్థితులేమిటో కమిషన్ విచారణ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మరోవైపు విచారణ కోసం కలెక్టరేట్‌లో ప్రత్యేక ఛాంబర్ కేటాయించారు. తొక్కిసలాట ప్రాంతాలను కమిషన్ సభ్యులు పరిశీలించారు. బైరాగిపట్టెడ, పద్మావతి పార్క్ రామానాయుడు పబ్లిక్ స్కూల్ ప్రాంతాలను సందర్శించారు. విచారణ సందర్భంగా కమిషన్ సభ్యులు టీటీడీ అధికారులు, పోలీసులను ప్రశ్నించే అవకాశం ఉంది. టోకెన్ల పంపిణీకి సరైన ఏర్పాట్లు చేశారో లేదో గుర్తించడంతో పాటు ఏకాదశి ఏర్పాట్లలో ఏవైనా లోటుపాట్లు ఉన్నాయా..? ఎలాంటి లోపాలున్నాయి..? అందుకు కారణమైన వ్యక్తులను గుర్తించాలని.. భవిష్యత్‌లో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి… తిరుమల సందర్శించే భక్తులకు ఎలాంటి భద్రత కల్పించాలన్న దానిపై న్యాయ విచారణ కమిషన్ విచారించి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది.
అలాగే సంస్థాగతంగా ఎలాంటి మార్పులు చేయాలన్న అంశంతో పాటు టీటీడీ ఉద్యోగులను ఏ విధంగా ఇలాంటి కార్యక్రమాలకు సన్నద్ధం చేయాలన్న దానిపైనా కమిషన్ సిఫారసులు చేయనుంది. న్యాయ విచారణ కమిషన్‌కు సివిల్ కోర్టుకు ఉండే అధికారాలను ప్రభుత్వం కట్టబెట్టింది.