డాక్టరై ప్రజల ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో వైద్య వృత్తి ఎంచుకున్న ఓ యువ డాక్టర్.. తన మరణంలోను ప్రాణదాతగా నిలిచింది. శ్రీసత్యసాయి జిల్లా తలుపుల మండలం నంగివాండ్లపల్లికి చెందిన భూమికారెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన కారు ప్రమాదంలో డాక్టర్ భూమిక రెడ్డి తీవ్ర గాయాల పాలయ్యారు. వారం రోజులు మృత్యుతో పోరాడిన డాక్టర్ భూమికారెడ్డి.. చికిత్సపొందుతూ ప్రాణాలు విడిచారు.
అయితే తాను మరణిస్తే అవయవదానం చేసి పలువురు ప్రాణాలు కాపాడాలని తల్లిదండ్రులు, స్నేహితులకు చెప్పిన డాక్టర్ భూమికా రెడ్డి.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తల్లిదండ్రులకు తీవ్ర విషాదాన్ని నింపింది. ఒక్కగానొక్క కుమార్తెను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో కూడా డాక్టర్ భూమికా రెడ్డి తల్లిదండ్రులైన నందకుమార్ రెడ్డి, లోహిత దంపతులు తమ బిడ్డ కోరిక తీర్చాలనుకుని అవయవదానానికి అంగీకరించారు. అలా భూమికా రెడ్డి ఊపిరితిత్తులు, గుండె, కాలేయం, కిడ్నీలను వేర్వేరు ఆసుపత్రులలో చికిత్స తీసుకుంటున్న రోగులకు అవయవ దానం చేశారు.
అలా మరణంలోనూ యువ డాక్టర్ భూమికా రెడ్డి ప్రాణదాత అయ్యారు. డాక్టర్ భూమికా రెడ్డి మరణంతో ఆమె స్వగ్రామం నంగివాండ్లపల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి. మరణించి.. ఐదుగురికి పునర్జన్మ ఇచ్చిన భూమికా రెడ్డి మానవత్వాన్ని… గ్రామస్తులు కొనియాడారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..