అమరావతి, ఫిబ్రవరి 7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంటర్ బోర్డు ఇంటర్ హాల్‌టికెట్లను విడుదల చేసింది. అయితే ఈసారి వాట్సప్ గవర్నెన్స్‌లో ఇంటర్ హాల్ టికెట్లను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులు వాట్సప్ ద్వారానే నేరుగా ఫిబ్రవరి 7వ తేదీ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కల్పించినట్లు బోర్డు వెల్లడించింది. ఫీజులు చెల్లించలేదని ప్రైవేటు కళాశాలల హాల్‌టికెట్లు ఆపేయడం వంటి ఘటనలు లేకుండా ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఇప్పటికే కూటమి సర్కార్ వాట్సప్ గవర్నెన్స్ ద్వారా 161 సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా ఇంటర్ హాల్ టికెట్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.
ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. వాట్సప్ నంబరు 95523 00009 ద్వారా వారంతా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే త్వరలో పదో తరగతి విద్యార్థులకు సైతం వాట్సప్ ద్వారా ఇలాంటి అవకాశం కల్పించాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. అలాగే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, వాటిని ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యాలయానికి అనుసంధానం చేసి పర్యవేక్షించనున్నారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 10 నుంచి 20 వరకు జరగనున్నాయి.
కాగా మార్చి 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, అలాగే మార్చి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే ఇంటర్ బోర్డు షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. ఈ మేరకు పూర్తి షెడ్యూల్‌ను బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.