ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని 28 ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్ధులను ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని గురుకుల సంస్థ వెల్లడించింది. ప్రవేశ పరీక్షలో ఎంపికైన విద్యార్థులకు ఉచిత వసతి, విద్య, భోజనం అందిస్తారు. పైగా ఆంగ్లం బోధనా మాధ్యమంలో సీబీఎస్‌ఈ సిలబస్‌ను విద్యార్ధులకు బోధిస్తారు. అర్హులైన గిరిజన, ఆదివాసి గిరిజన, సంచార గిరిజన తదితర కేటగిరీలకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 19, 2025వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఫిబ్రవరి 25న ప్రవేశ పరీక్ష ఉంటుంది.
ఏపీ ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాల్లో 6వ తరగతి అడ్మిషన్లు పొందగోరే విద్యార్ధులు తప్పనిసరిగా 2024-25 విద్యాసంవత్సరంలో ఏదైనా ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి చదివి ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్ష మించకూడదు. విద్యార్ధుల వయోపరిమితి మార్చి 31, 2025 నాటికి 10 నుంచి 13 ఏళ్ల లోపు ఉండాలి. ఈ అర్హతలున్న బాలికలు, బాలురు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఒక్కో ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయంలో ఆరో తరతగతిలో 60 సీట్ల చొప్పున ఉంటాయి. ఇలా మొత్తం 28 ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాల్లో మొత్తం 1,680 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో 840 సీట్లు బాలురకు, 840 సీట్లు బాలికలకు కేటాయిస్తారు. రాత పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు ఇవే..
- ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఫిబ్రవరి 19, 2025.
- అడ్మిట్ కార్డుల విడుదల తేదీ: ఫిబ్రవరి 22, 2025.
- ప్రవేశ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 25, 2025.
- మొదటి మెరిట్ జాబితా వెల్లడి: మార్చి 15, 2025.
- ఎంపికైన విద్యార్థుల జాబితా వెల్లడి: మార్చి 25, 2025.
పరీక్ష విధానం ఇలా..
ఆరో తరగతిలో ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ మొత్తం 100 మార్కులకు ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ విభాగం నుంచి 50 ప్రశ్నలు, అరిథ్‌మెటిక్ విభాగం నుంచి 25 ప్రశ్నలు, లాంగ్వేజ్ విభాగం నుంచి 25 ప్రశ్నల చొప్పున అడుగుతారు. తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో పరీక్ష ఉంటుంది.
ఇవి కూడా చదవండి
ఏపీ ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాల అడ్మిషన్ నోటిఫికేషన్ 2025 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.