దేశంలో జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. జనగణన కోసం తాజా బడ్జెట్‌లో పరిమిత కేటాయింపులు చేయడమే దీనికి కారణం అంటున్నారు నిపుణులు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో జనగణన, నేషనల్ పీపుల్స్ రిపోర్ట్ ప్రక్రియ కోసం రూ.574.80 కోట్లను కేటాయించారు. దీనిని బట్టి చూస్తే ఈ ఏడాది సెన్సెస్ లేనట్లేనని తెలుస్తోందంటున్నారు.
అంతకుముందు 2021-2022లో జనగణనకు రూ.3,768 కోట్లను ప్రతిపాదించినప్పటికీ ఆ దిశగా అడుగులు పడలేదు. 2023-24 బడ్జెట్‌లో జనాభా లెక్కల కోసం కేవలం రూ.578.29 కోట్లు మాత్రమే కేటాయించారు. 2024-25లో ఆ మొత్తాన్ని కాస్త పెంచారు. రూ.1,309.46 కోట్లను కేటాయించారు. కానీ ఇప్పుడు ఆ మొత్తం సగానికి పైగా తగ్గింది. రూ.8,754.23 కోట్లతో జనగణన, రూ.3,941.35 కోట్లతో ఎన్‌పీఆర్ కోసం ఉద్దేశించిన ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ 2019 డిసెంబరు 24న ఆమోదముద్ర వేసింది. 2020 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు 30 మధ్య ఆ ప్రక్రియ జరగాల్సింది.
అయితే కొవిడ్-19 మహమ్మారితో అది వాయిదా పడింది. అప్పటినుంచి ప్రభుత్వం దీన్ని నిలుపుదలలో ఉంచింది. గత ఏడాది చైనాను అధిగమించి అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ ఆవిర్భవించినట్లు ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. అయితే దీనికి సంబంధించి కచ్చితమైన లెక్కలు లేవు. వేర్వేరు కేంద్ర పథకాలకు సంబంధించి 2011 నాటి జనాభా లెక్కల ఆధారంగానే లక్ష్యాలు, వ్యయ అంచనాలు రూపొందిస్తున్నారు. మరోవైపు జనగణన కొలిక్కి వచ్చేవరకు నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ కూడా ఆగాల్సిందేనంటున్నారు నిపుణులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..