న్యూఢిల్లీ, నవంబర్ 24: పదో తరగతి పూర్తైన బాలికలకు సీబీఎస్‌ఈ బోర్డు గుడ్‌న్యూస్ చెప్పింది. సీబీఎస్‌ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ మెరిట్ స్కాలర్‌షిప్ నోటిఫికేషన్ 2024 విడుదల చేసింది. తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా కలిగి ఉన్న పదో తరగతిపూర్తి చేసిన బాలికా విద్యార్ధినులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. యేటా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) తల్లిదండ్రులకు ఏకైక బాలికా సంతానంగా ఉన్న ప్రతిభ కలిగిన విద్యార్థినులకు ఈ నోటిఫికేషన్ జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా పదోతరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థినుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. అయితే దరఖాస్తు చేసుకునే బాలికలు.. తల్లిదండ్రులకు ఏకైక కూతురై ఉండాలి. అలాగే సీబీఎస్‌ఈలో పదోతరగతి పూర్తి చేసి, సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలలో 11వ తరగతి లేదా పన్నెండో తరగతి చదువుతూ ఉండాలి. పదో తరగతి పరీక్షలో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఈ అర్హత కలిగిన విద్యార్థినులు డిసెంబర్ 23, 2024వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన ఇతర వివరాలు సీబీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
సీబీఎస్‌ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్ పరీక్షకు 95.69 శాతం హాజరు.. త్వరలో ఫలితాలు
తెలంగాణలో వైద్య ఆరోగ్య సర్వీసుల నియామక బోర్డు శనివారం(నవంబర్ 3) నిర్వహించిన నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్‌నర్స్) ఆన్‌లైన్ విధానంలో నర్సింగ్ ఆఫీసర్ నియామక పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు 95.69 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 42,244 మంది దరఖాస్తు చేయగా 40,423 మంది పరీక్ష రాశారు.
యూపీఎస్సీ ఈఎస్‌ఈ తుది ఫలితాలు వచ్చేశాయ్..
యూపీఎస్సీ ‘ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2024’ తుది ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈఎస్‌ఈ మెయిన్స్ జూన్ 23వ తేదీన జరగ్గా.. అక్టోబర్-నవంబర్ నెలల్లో ఇంటర్వ్యూ నిర్వహించింది. తాజాగా తుది ఫలితాలను వెల్లడించింది. ఈ ప్రకటన ద్వారా యూపీఎస్సీ దేశవ్యాప్తంగా రైల్వే, టెలికాం, డిఫెన్స్ సర్వీస్ తదితర కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఇంజినీరింగ్ ఉద్యోగాలు భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో మొత్తం 206 మంది ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యారు.