హైదరాబాద్, ఫిబ్రవరి 3: మృత్యువు ఎప్పుడు.. ఏ రూపంలో దూసుకొస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. అలాంటి సంఘటనే BDL భానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. బైక్పై వెళ్తున్న తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య గన్‌మెన్‌ను ఓ అడవి పంది మృత్యువు రూపంలో పొట్టనబెట్టుకుంది. బైక్‌పై వెళ్తున్న గన్‌మెన్ శ్రీనివాస్‌కు అడవి పంది అడ్డు రావడంతో దానిని తప్పించే క్రమంలో బైక్ అదుపుతప్పి కింద పడిపోయాడు. ఈ ఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా BDL భానూరు పీఎస్ పరిధిలోని వెలిమల తండా సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వ్యక్తిగత పనుల నిమిత్తం కొండకల్ నుంచి వెలిమెలకు బైక్‌పై వెళ్తున్న క్రమంలో గన్‌మెన్ శ్రీనివాస్ ఆకస్మికంగా మృతి చెందడం కుటుంబ సభ్యులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది.
చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య వద్ద.. శంకర్ పల్లి మండలం బుల్కాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ గన్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. యాదయ్య ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి శ్రీనివాస్ అతనికి ఎంతో నమ్మకస్తుడిగా ఉంటూ వస్తున్నాడు. తాజా ప్రమాద ఘటనలో శ్రీనివాస్ మృతి చెందడం బాధాకరమని పార్టీ వర్గాలు సంతాపం ప్రకటిస్తున్నాయి. అడవి పంది అడ్డు రావడంతో.. దానిని తప్పించే క్రమంలో బైక్ అదుపుతప్పి శ్రీనివాస్ కింద పడిపోయాడు. దీంతో గన్‌మెన్ శ్రీనివాస్ తీవ్రంగా గాయపడి.. అక్కడికక్కడే మృతి చెందాడు.
స్థానికులు సమాచారం అందించడంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పటాన్ చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. బైక్పై తన దారిలో తాను వెళుతుంటే అడవి పంది మృత్యువు రూపంలో వచ్చి శ్రీనివాస్ ప్రాణాన్ని హరించింది. దీంతో శ్రీనివాస్ స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.