ఓ 60 ఏళ్ల వృద్ధ టూరిస్ట్ సరదాగా పర్యటనకు వచ్చి అనుకోకుండా చావు అంచులకు చేరాడు. ముందే జాగ్రత్త పడాల్సిన అవసరం వచ్చినా.. లెక్క చేయకుండా తన చావును తానే కొని తెచ్చుకున్నట్లు అయింది అతని పరిస్థితి. ఏనుగుల దాడిలో తీవ్రంగా గాయపడి రోడ్డు పక్కనే ఆ వృద్ధుడు మృతి చెందిన సంఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో చోటు చేసుకుంది.
మంగళవారం(ఫిబ్రవరి 2) సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా వాల్పరైలోని టైగర్ వ్యాలీ వ్యూపాయింట్ సమీపంలో ఏనుగుల దాడిలో మైఖేల్ అనే 60 ఏళ్ల జర్మన్ టూరిస్ట్ చనిపోయాడు. మైఖేల్ ద్విచక్ర వాహనంపై పొల్లాచ్చి నుంచి వాల్పరై వెళ్తున్న క్రమంలో ఈ ఘోరం జరిగింది. ఆ ప్రాంతం ఏనుగులకు స్థావరం అని, రోడ్డు పక్కన ఆగవద్దని స్థానికులు ఎంత హెచ్చరించినప్పటికీ అతను జాగ్రత్త పడలేదు. దారిలో ఏనుగు కనిపిస్తున్నా, బైక్‌పై రయ్ మంటూ దూసుకెళ్లి చావు కొనితెచ్చుకున్నాడు. ఏనుగు దాడిలో ప్రాణాలు కోల్పోయాడు.
ఆ ప్రాంతంలో ఏనుగుల వల్ల గతంలో కూడా చాలా మంది గాయాల పాలవడంతో పాటు మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. టైగర్ వ్యాలీ వ్యూపాయింట్ ఎన్నో రకాల అడవి మృగాలకు నివాసంగా ఉంటుంది. ఆ మార్గం గుండా వెళ్తున్న ఎవరైనా.. ఎక్కడా ఆగకుండా వెళ్లిపోవాలి. లేదా మన ప్రాణాలకే ప్రమాదం. స్థానికులు ముందుగానే హెచ్చరించినప్పటికీ అతను మరింత ముందుకు వెళ్ళడంతోనే ఇలా ఘోరం జరిగింది. ముందే జాగ్రత్త పడి ఉంటే అతని ప్రాణాలు దక్కేవి అని స్థానికులు చెబుతున్నారు.
మైఖేల్ ప్రమాద స్థలానికి చేరుకున్నప్పుడు ఒక ఏనుగు అతనిపైకి దూసుకెళ్లి, అతని వాహనం నుంచి పడగొట్టింది. దీంతో అతను తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నంలో మెల్లగా లేచి రోడ్డువైపుగా వచ్చాడు. ఆ క్రమంలో అక్కడే ఉన్న ఏనుగు మరోసారి అతనిపై దాడికి పాల్పడింది. ఆపై అతనిని తీవ్రంగా గాయపరిచింది. ఏనుగు దాడిలో తీవ్ర గాయాలతో మైఖేల్ అక్కడే కుప్పకూలిపోయాడు. అతనికి శ్వాస అందకపోవడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు విచారణ చేపట్టారు.
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..