హైదరాబాద్, ఫిబ్రవరి 5: దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి జనవరి 22 నుంచి 29 తేదీల మధ్య జరిగిన పేపర్ 1 జేఈఈ మెయిన్ సెషన్-1 (జనవరి 2025) పరీక్ష, ఇక 30వ తేదీన జరిగిన బీఆర్క్, బీ ప్లానింగ్ సీట్ల కోసం పేపర్-2 జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీని ఎన్‌టీఏ విడుదల చేసింది. ప్రాథమిక కీపై ఫిబ్రవరి 4 నుంచి 6వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా రెండు పేపర్లకు కలిపి దాదాపు 12 లక్షల మందికిపైగా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరిగాయి. ప్రాధమిక కీపై అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది కీ రూపొందించి, ఆ వెనువెంటనే ఫలితాలు కూడా వెల్లడిస్తారు. అందిన సమాచారం మేరకు ఫిబ్రవరి 12న జేఈఈ మెయిన్ తొలి విడత ర్యాంకులు ప్రకటించనున్నారు.
ఏప్రిల్‌లో జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు
ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీల మధ్య రెండో విడత జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు జరగనున్నాయి. ప్రస్తుతం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. జేఈఈ మెయిన్ చివరి విడత దరఖాస్తులకు ఫిబ్రవరి 25 వరకు గడువు ఉంది. జేఈఈ మెయిన్ చివరి విడత ముగిసిన తర్వాత రెండిటిలో ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని ఏప్రిల్ 17న తుది ర్యాంకులు ప్రకటిస్తారు. జేఈఈ మెయిన్‌లో కనీస మార్కులు సాధించిన తొలి 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. మే 18న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఉంటుంది.
జేఈఈ మెయిన్ ర్యాంకులతో ఎన్‌ఐటీలు, అడ్వాన్స్‌డ్ ర్యాంకులతో ఐఐటీల్లో సీట్లు కేటాయిస్తారన్న సంగతి తెలిసిందే. దేశంలోని 31 ఎన్‌ఐటీల్లో గత ఏడాది సుమారు 24 వేలు, 23 ఐఐటీల్లో 17,600, ట్రిపుల్‌ఐటీల్లో దాదాపు 8,500, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో 57 వేల సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా జేఈఈ మెయిన్ రాసిన ప్రతి 100 మందిలో సరాసరిన కేవలం నలుగురికి మాత్రమే సీట్లు దక్కుతాయి. అందువల్లనే జేఈఈ పరీక్షకు విపరీతమైన పోటీ ఉంటుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.