అమరావతి, ఫిబ్రవరి 12: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పనితీరుపై పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక్క ప్రభుత్వ పాఠశాలను కూడా మూసేయడం జరగదనీ, అన్నీ కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఇద్దరు విద్యార్థులు చదువుతున్నా ఆ బడిని కొనసాగిస్తామనీ, వాటికీ ఉపాధ్యాయులను కేటాయిస్తామని ఆయన వెల్లడించారు. అవసరమైతే గ్రామస్థులందరూ నిర్ణయం తీసుకొని, ఒకరిద్దరు విద్యార్థులను అదే పంచాయతీలోని ఆదర్శ పాఠశాలకు పంపించుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తామని ఆయన సూచించారు. ఈ మేరకు విజయవాడలో సమగ్ర శిక్షా అభియాన్ కార్యశాల ప్రారంభ కార్యక్రమంలో ఆయన వెల్లడించారు. మరోవైపు జీవో-117 రద్దుకు ప్రత్యామ్నాయ కసరత్తు కొనసాగుతోందని అన్నారు. ఫిబ్రవరి చివరి నాటికి ఈ కసరత్తును పూర్తిచేసి జీవో 117 పూర్తిగా రద్దు చేస్తామని ఆయన గతంలోనూ పేర్కొన్నారు. ఆ తర్వాత కొత్తగా జారీచేసే జీవో ఆధారంగా ఏప్రిల్‌లో ఉపాధ్యాయ బదిలీలు ఉంటాయని ఆయన తెలిపారు.
వలసలున్న ప్రాంతాల్లో ప్రత్యేక పాఠశాలలు ఏర్పాట్లు.. సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వలసలు ఎక్కువగా ఉండే చోట మహాత్మా జ్యోతిబా ఫులే పాఠశాలలు (మోడల్ స్కూల్స్) ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు బీసీ సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే రూ.90 కోట్లతో బీసీ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు సచివాలయంలో ఫిబ్రవరి 11న నిర్వహించిన సమావేశంలో బీసీ సంక్షేమశాఖపై సమీక్ష నిర్వహించారు.
ఫిబ్రవరి 13 నుంచి జేఎల్ కౌన్సెలింగ్..
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అధ్యాపకులుగా ఎంపికైన 1,286 మందికి ఫిబ్రవరి 13 నుంచి 19వ తేదీ వరకు జేఎల్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఎంపికైన వారందరికీ గన్‌ఫౌండ్రీలోని మహబూబియా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కౌన్సెలింగ్ ఉంటుంది. అదే రోజు పోస్టింగ్ కోసం ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.