హైదరాబాదులో దారుణ ఘటన చోటుచేసుకుంది. కొన్ని కారణాల చేత తల్లి లలిత అకాల మరణం చెందింది. తల్లి దహన సంస్కారాలకు కూడా డబ్బులు లేకపోవడంతో ఏం చేయాలో తోచని ఇద్దరు కూతుళ్లు మృతదేహాన్ని బయటికి తీసుకెళ్లలేక ఇంట్లోనే పెట్టుకుని పది రోజులపాటు గడిపారు. సికింద్రాబాద్ లోని వారాసిగూడ లో ఈ ఘటన చోటుచేసుకుంది. జనవరి 22న లలిత అకాలమరణం చెందింది. 23 ఉదయం ఎంత లేపిన తల్లి కళ్ళు తెరవకపోవడంతో ఇద్దరు కూతుర్లు ఆందోళన చెందారు. అయితే చివరికి తమ తల్లి చనిపోయినట్లు నిర్ధారించుకున్నారు.
అయితే అప్పటికే ఆర్థిక సమస్యలతో పాటు కుటుంబ సమస్యలు కూడా వీరిని వెంటాడాయి. తల్లి చనిపోయిన విషయం కనీసం బంధువులకు కూడా చెప్పుకోలేని దయనీయ స్థితిలో ఉన్నారు. తల్లి మృతదేహానికి దహన సంస్కారాలు చేసేందుకు కావలసిన డబ్బులు కూడా తమ వద్ద లేకపోవడంతో ఇంట్లోనే తల్లి మృతదేహాన్ని ఉంచి పది రోజులు గడిపారు. ఇక బాడీ డీకంపోస్ అవుతున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెప్పి సహాయం కోరారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఫిర్యాదు చేసేలా ఇద్దరు కూతుళ్లకు సలహా ఇచ్చారు.
ఎమ్మెల్యే నివాసం నుండి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఇద్దరు కూతుర్లు జరిగిన విషయం మొత్తాన్ని పోలీసులకు చెప్పారు. దాంతో పోలీసులు వారాసిగూడలో ఉన్న వారి నివాసం వద్దకు వెళ్లారు. ఇద్దరు కూతుళ్లు చెప్పిన విధంగానే లోపల తల్లి మృతదేహం ఉండటంతో పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. ఇద్దరు కూతుళ్ల నుండి పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అయితే తమ తల్లి మరణించిన విషయాన్ని జీర్ణించుకోలేక ఇద్దరు కూతుళ్లు సైతం ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. కానీ, ధైర్యం సరిపోలేదని చెప్పారు. ఆ ఇద్దరి ఫిర్యాదు మేరకు వెంటనే స్పందించిన పోలీసులు లలిత మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి ఆమె దహన సంస్కారాల కోసం మున్సిపల్ అధికారులకు అప్పగించారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..