బేగంపేట పోలీసుస్టేషన్ పరిధిలో ఈ నెల 11న ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన డిగ్రీ విద్యార్థిని స్రవంతి కేసు చిక్కుముడి వీడింది. అన్న భార్య(వదిన) శైలజ వల్లే విద్యార్థిని ఒత్తడికి గురై తనువు చాలించిందని ఎంక్వైరీలో తేల్చారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. రసూల్‌పురా ఇందిరమ్మనగర్‌కు చెందిన విఠల్ కుమార్తె.. స్రవంతి(19) ఈ నెల 11వ తేదీన ఇంట్లో ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. తమ నివాసానికి సమీపంలో ఉండే ఓ యువకుడి కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు దర్యాప్తు భాగంగా స్రవంతి సెల్‌ఫోన్ డేటాను విశ్లేషించిన పోలీసులు.. మెసేజ్‌ల ఆధారంగా యూసుఫ్‌గూడ రహమత్‌నగర్‌కు చెందిన నవీన్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించగా అసలు నిజం వెలుగుచూసింది.
స్రవంతి వదిన శైలజకు నవీన్‌కుమార్‌తో పెళ్లికి ముందే అక్రమ సంబంధం కొనసాగుతుంది. అతను ఇటీవల మళ్లీ శైలజను రహస్యంగా కలవడం షురూ చేశాడు. ఈ విషయాన్ని అనుకోకుండా స్రవంతి గుర్తించింది. తమ రంగు ఎక్కడ బయటపడుతుందోనని భావించిన వదిన.. స్రవంతికి ఇంటి పక్కనే ఉండే ఓ యువకుడితో సంబంధం ఉందంటూ తప్పుడు ప్రచారానికి తెరతీసింది. అతను తనకు అన్నలాంటివాటు అని చెప్పినా.. వదల్లేదు. పైగా తనతో అక్రమ సంబంధం నెరపుతున్న నవీన్‌కుమార్‌ను రంగంలోకి దించి అతనితో స్రవంతి ఫోన్‌కు మెసేజ్‌లు పంపిస్తుండేది. వదిన, నవీన్‌కుమార్‌లు పెట్టే వేధింపులు తట్టుకోలేక స్రవంతి తీవ్ర ఒత్తిడికి లోనై తనువు చాలించింది. కోడలే తమ కుమార్తె మృతికి కారణమైనట్లు పోలీసుల విచారణలో బయటపడటంతో స్రవంతి తల్లిదండ్రులు షాక్‌కుగురయ్యారు. శైలజతో పాటు నవీన్‌కుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…