అమరావతి, ఫిబ్రవరి 3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కళాశాలల్లోని విద్యార్థులకు జేఈఈలో రాణించేందుకు విద్యాశాఖ మంత్రి లోకేశ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా తొలుత గుంటూరు, అనంతపురం జిల్లాల్లోని 29 ప్రభుత్వ జూనియర్ కాలేజీలను ఎంపిక చేశారు. వీటిల్లో చదువుతున్న మొత్తం 1800 మంది విద్యార్థులకు చెన్నైలోని ఐఐటీ ప్రొఫెసర్లతో ఆన్‌లైన్ క్లాసులు చెప్పిస్తున్నారు. ఈ మేరకు గత ఏడాది డిసెంబరు నెల నుంచి స్థానిక అధ్యాపకుల పర్యవేక్షణలో ప్రతి రోజూ జేఈఈ మెయిన్ ఆన్‌లైన్ తరగతులు జరుగుతున్నాయి.
విద్యార్ధులకు ఇస్తున్న జేఈఈ మెయిన్ కోచింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం ‘విద్యాశక్తి’గా నామకరణం చేసింది. ఆయా కాలేజీల్లో ప్రతి రోజూ మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల పాటు జేఈఈ పాఠాలను వర్చువల్ లెవల్‌లో బోధిస్తున్నారు. ఎంతో కఠినమైన జేఈఈ క్రాక్ చేయాలంటే శిక్షణ తప్పనిసరిగా అవసరమని.. శిక్షణతోనే జేఈఈ రాసేందుకు ఎక్కువ మంది విద్యార్ధులు ఆసక్తి చూపిస్తున్నారని గుంటూరులోని బాలికల జూనియర్ కళాశాల అధ్యాపకులు చెబుతున్నారు. ఈ మేరకు మంత్రి లోకేశ్ చొరవతో పేదింటి విద్యార్ధులకు ఉన్నత చదువులు చదివేందుకు మార్గం సుగమం అవుతోంది.
కాగా ఎంతో కఠినమైన జేఈఈ పరీక్ష ఆల్ ఇండియా స్థాయిలో జరుగుతుందన్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షను ప్రతీయేట రెండు విడతల్లో నిర్వహిస్తారు. ఈ ఏడాదికి తొలి విడత జేఈఈ మెయిన్ పరీక్ష పూర్తికాగా.. ప్రస్తుతం తుది విడత ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తున్నారు. తొలి విడతలో దేశ వ్యాప్తంగా దాదాపు 15 లక్షల మంది విద్యార్ధులు పోటీ పడ్డారు. ఇక మలి విడతలోనూ ఇదే స్థాయిలో పోటీ ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. జేఈఈ మెయిన్‌లో వచ్చిన ర్యాంకుల్లో తొలి 2.5 లక్షల మందిని మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అనుమతిస్తారు. మే 18న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఉంటుంది. జేఈఈ మెయిన్ ర్యాంకులతో ఎన్‌ఐటీలు, అడ్వాన్స్‌డ్ ర్యాంకులతో ఐఐటీల్లో సీట్లు పొందొచ్చు. కాగా జేఈఈ మెయిన్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశ వ్యాప్తంగా ఉన్న 31 ఎన్‌ఐటీల్లో బీఈ, బీటెక్ కోర్సుల్లో, జేఈఈ అడ్వాన్స్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా మొత్తం 23 ఐఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో బీఆర్క్‌లో సీట్లు కేటాయిస్తారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.