కేరళలో ర్యాగింగ్ భూతానికి బలైన 15 ఏళ్ల మిహిర్ ఆత్మహత్యపై ప్రకంపనలు కొనసాగుతున్నాయి. కొచ్చి లోని స్కూళ్లో క్లాస్‌మేట్స్ ర్యాగింగ్ భరించలేక జనవరి 15వ తేదీన ఆత్మహత్యకు పాల్పడ్డాడు మిహిర్ అహ్మద్. తన కుమారుడికి న్యాయం కావాలని మిహిర్ తల్లి అందరిని వేడుకుంటోంది. ఈ ఘటనపై పలువురు ప్రముఖులు స్పందించారు. రాజకీయ నేతలతో పాటు సినీ సెలబ్రిటీలు ఈ దారుణాన్ని తీవ్రంగా ఖండిచారు.
స్కూళ్లలో విద్యార్ధుల భద్రతపై మరోసారి చర్చ
మిహిర్ అహ్మద్ ఆత్మహత్య ఘటన స్కూళ్లలో విద్యార్ధుల భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది. 26వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు మిహిర్. కొచ్చిలో గ్లోబల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు మిహిర్ అహ్మద్. నల్లగా ఉన్నావని ప్రతి రోజు అతడిని తోటి విద్యార్ధులు టార్చర్ చేశారు. తిట్టడమే కాకుండా పలుమార్లు దాడి కూడా చేశారు.
మిహిర్ ఆత్మహత్యకు పాల్పడిన రోజు చిత్రహింసలు పెట్టారని అతడి తల్లి ఆరోపించారు . వాష్‌రూమ్‌కు తీసుకెళ్లి టాయ్‌లెట్ సీటును నాకించారని , టాయ్‌లెట్‌లో తలను ముంచారని ఆరోపించారు. అంతేకాకుండా మిహిర్ చనిపోయిన తరువాత కూడా అతడిపై సోషల్‌మీడియాలో గెలి చేసే విధంగా తోటి విద్యార్ధులు కామెంట్స్ పెట్టారు.
గ్లోబల్ స్కూల్ యాజమాన్యం తీరుపై ఆగ్రహం
అయితే స్కూల్ యాజమాన్యం మాత్రం ఈ ఆరోపణలు అవాస్తవమంటోంది. మిహర్‌ను ఎవరు ర్యాగింగ్ చేయలేదని , వేధించలేదని , పోలీసుల దర్యాప్తులో దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని చెబుతోంది. గ్లోబల్ స్కూల్ యాజమాన్యం తీరుపై మిహిర్ అహ్మద్ తల్లి మండిపడుతున్నారు. తన కుమారుడికి న్యాయం కావాలని మిహిర్ తల్లి రాజ్న కేరళ సీఎం విజయన్‌కు లేఖ రాశారు. హిల్ ప్యాలెస్ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. వీలైనంత త్వరగా దోషులను పట్టుకోవాలని , లేదంటే డిజిటల్ సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని పేరంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మిహిర్ ఆత్మహత్యపై పలువురు సెల్రబిటీలు స్పందించారు. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు రాహుల్‌గాంధీ. సినీ నటి సమంత కూడా ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మిహిర్ కుటుంబానికి న్యాయం జరగాలని కీర్తి సురేశ్ కూడా ట్వీట్ చేశారు.
కేరళలో మిహిర్ అహ్మద్ ఆత్మహత్య ఘటనపై విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగాయి. మిహిర్ అహ్మద్ ఆత్మహత్య ఘటనపై కేరళ స్టూడెంట్ యూనియన్ ఆందోళన చేపట్టింది. బారికేడ్లను తొలగించేందుకు ఆందోళనకారులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు , ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులపై పోలీసులు వాటర్ కెనాన్లు ప్రయోగించారు. లాఠీఛార్జ్ చేశారు. పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..