ఒకప్పుడు బంగాళదుంపలు కొన్ని వారాల తర్వాత మాత్రమే మొలకలు వచ్చేవి కానీ ఇప్పుడు రెండు, మూడు రోజుల్లోనే మొలకలు వస్తున్నాయి. ఈ మొలకలు వచ్చిన బంగాళదుంపలను తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొన్ని సాధారణ చిట్కాలను పాటిస్తే బంగాళదుంపలను ఎక్కువ రోజులు తాజాగా ఉంచుకోవచ్చు.
బంగాళదుంపలను నిల్వ చేసే ప్రదేశం చాలా ముఖ్యం. వీటిని ఎప్పుడూ చల్లగా, గాలి ఆడే ప్రదేశంలో, తక్కువ వెలుతురున్న ప్రదేశంలో ఉంచడం మంచిది. ఎక్కువ చలిలో నిల్వ చేస్తే అంటే ఫ్రిజ్‌లో ఉంచితే బంగాళదుంపల్లోని పిండి పదార్థం చక్కెరగా మారుతుంది. దీని వలన రుచి మారిపోతుంది. వండినప్పుడు అసలు అనుకున్నటువంటి ఫ్లేవర్ రాదు. అలాగే తేమ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఉంచితే ఇవి త్వరగా పాడైపోతాయి.
ఇవి నిల్వ చేసే ప్రదేశంలో ఎక్కువ కాంతి ఉండకూడదు. బహిరంగంగా, నేరుగా సూర్యకాంతి వచ్చే ప్రదేశంలో ఉంచితే బంగాళదుంపలు ఆకుపచ్చగా మారతాయి. దీని కారణంగా వాటిలో చేదు రుచి పెరుగుతుంది. కాబట్టి బంగాళదుంపలను ఎల్లప్పుడూ చీకటి ప్రదేశంలో పెట్టడం మంచిది. మార్కెట్ నుండి కొత్తగా తెచ్చినప్పుడు, పాడైపోయిన బంగాళదుంపలు ఉంటే అవి మిగతా బంగాళదుంపలపై ప్రభావం చూపకుండా వేరు చేయాలి.
నిల్వ చేసే పద్ధతులు కూడా చాలా ముఖ్యం. బంగాళదుంపలను నిల్వ చేసేటప్పుడు ప్లాస్టిక్ సంచుల కన్నా గాలి ఆడే గోనె సంచులు, బుట్టలు లేదా కాగితపు సంచులు ఉపయోగించడం ఉత్తమం. మూసివున్న సంచుల్లో ఉంచితే అవి తేమను పట్టుకొని త్వరగా మొలకెత్తే అవకాశం ఉంటుంది. అలాగే త్వరగా పాడైపోతాయి కూడా. ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే బంగాళదుంపలు ఎక్కువ రోజుల పాటు మంచిగా ఉంటాయి.
బంగాళదుంపలను ఉల్లిపాయలు లేదా అరటిపండ్లతో కలిపి ఉంచకూడదు. ఎందుకంటే ఇవి ఎథిలీన్ అనే వాయువును విడుదల చేస్తాయి. ఇది బంగాళదుంపల పెరుగుదలను ప్రేరేపిస్తుంది. దీని వలన ఇవి త్వరగా మొలకలు రావడానికి కారణమవుతాయి. అందుకే బంగాళదుంపలను వేరుగా, తేమ రానివ్వని గాలి ఆడే ప్రదేశంలో మాత్రమే నిల్వ చేయాలి.
అంతేకాక పెద్ద మొత్తంలో బంగాళదుంపలు నిల్వ చేయడం కన్నా, అవసరానికి తగ్గట్టుగా కొంటే మంచిది. దీని వలన అవి త్వరగా మొలకలు రాకుండా ఉంటాయి. ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంటాయి. సరైన నిల్వ పద్ధతులు పాటించడం వల్ల బంగాళదుంపలు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము. కాబట్టి ఈ చిన్న చిట్కాలను పాటించి బంగాళదుంపలను సరిగ్గా నిల్వ చేసుకోండి.