Lucky Baskhar Review: లక్కీ భాస్కర్ మూవీ రివ్యూ.. దుల్కర్ సల్మాన్ సినిమా ఎలా ఉందంటే

2 hours ago 1

మూవీ రివ్యూ: లక్కీ భాస్కర్

నటీనటులు: దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, రాంకీ, సూర్య శ్రీనివాస్, మానస చౌదరి, సచిన్ ఖేడ్‌కర్, టినూ ఆనంద్, కసిరెడ్డి, హైపర్ ఆది తదితరులు

సినిమాటోగ్రఫీ: నిమిష్ రవి

ఎడిటర్: నవీన్ నూలి

సంగీతం: జివి ప్రకాశ్ కుమార్

నిర్మాత: సూర్యదేవర నాగవంశీ

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: వెంకీ అట్లూరి

మహానటి, సీతారామం లాంటి సినిమాలతో తెలుగు హీరో అయిపోయాడు దుల్కర్ సల్మాన్. ఈయన నుంచి సినిమా వస్తుందంటే చాలు కచ్చితంగా బాగుంటుందనే నమ్మకాన్ని కలిగించాడు. తాజాగా లక్కీ భాస్కర్ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సార్ తర్వాత వెంకీ అట్లూరి తెరకెక్కించిన సినిమా ఇది. మరి ఈ సినిమాతో దుల్కర్ తెలుగులో హ్యాట్రిక్ అందుకున్నాడా లేదా అనేది చూద్దాం..

కథ:

కథ అంతా 1989-92 మధ్యలో జరుగుతుంది. భాస్కర్ కుమార్ (దుల్కర్ సల్మాన్) ముంబయిలో మగధ అనే ప్రైవేటు బ్యాంకులో క్యాషియర్‌గా పని చేస్తుంటాడు. ఇంట్లో అతడే పెద్ద కొడుకు.. చాలా బాధ్యతలుంటాయి. దాంతో జీతం సరిపోక అప్పులు చేస్తూ ఇంటిని నెట్టుకొస్తుంటాడు. ఇంటి మీదకు అప్పుల వాళ్లు వస్తే తప్పించుకుంటూ ఉంటాడు. ఇలా భాస్కర్ జీవితం గడుస్తూ ఉంటుంది. ఆయనకు భార్య సుమతి (మీనాక్షి చౌదరి), కొడుకు ఉంటాడు. బ్యాంకులో వచ్చే జీతం సరిపోక ఏవో చిన్న చిన్న పార్ట్ టైమ్ బిజినెస్ కూడా చేస్తుంటాడు. అలాంటి భాస్కర్ జీవితంలోకి ఒకసారి ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ బిజినెస్ చేసే ఆంటోనీ (రాంకీ) వస్తాడు. తన జాబ్‌ను రిస్క్ చేసి ఆంటోనీతో కలిసి బిజినెస్ మొదలు పెడతాడు భాస్కర్. అక్కడ కోట్లు సంపాదిస్తాడు. బ్యాంకులో డబ్బుతో ఇల్లీగల్ పనులు చేస్తూనే తెలివిగా తప్పించుకుంటాడు. ఇలా సాగుతున్నపుడు సీబీఐ అధికారుల కన్ను భాస్కర్ మీద పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది.. సాధారణ బ్యాంక్ ఎంప్లాయ్ ఖాతాలోకి వందల కోట్లు ఎలా వచ్చాయి అనేది అసలు కథ..

కథనం:

సినిమా అదిరిపోయిందిరా.. భలే తీసార్రా..! ఓ సినిమా లవర్‌గా ఈ మాట రాయడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. కానీ ఈ మాట చెప్పే ఛాన్స్ ఈ మధ్య కాలంలో చాలా తక్కువ సినిమాలు మాత్రమే ఇచ్చాయి. ఇప్పుడు లక్కీ భాస్కర్ రూపంలో మరో అవకాశం వచ్చింది.. సినిమా అదిరిపోయింది.. నిజంగా అదిరిపోయింది. వెంకీ అట్లూరి డైరెక్షన్ కంటే కూడా రైటింగ్‌కు ఫిదా అయిపోతారంతా. ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టకుండా.. కట్టి పడేసే స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. బలమున్నోన్ని కొట్టొచ్చు కానీ తెలివైనోన్ని కొట్టలేం అనేది లక్కీ భాస్కర్ లైన్. బ్యాంకింగ్ రంగంలో జరిగే స్కామ్స్‌ను తెలివిగా వాడుకుని.. ఓ సామాన్యుడు అసామాన్యుడుగా ఎలా ఎదిగాడు అనేది ఈ సినిమా కథ. ఒక్కో సీన్‌ను వెంకీ అట్లూరి డిజైన్ చేసిన తీరు అద్భుతంగా వర్కవుట్ అయింది. ముఖ్యంగా మొదటి అరగంట కామన్ మ్యాన్ కష్టాలు బాగా ఎస్టాబ్లిష్ చేసాడు. హీరో డబ్బు సంపాదించడం మొదలు పెట్టిన తర్వాత.. అదేదో మనకే డబ్బు వస్తున్నట్లు కథలో లీనమైపోతాం. హీరో కంగారు పడితే మనం కంగారు పడతాం.. హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉంటాం.. హీరో ఎక్కడ దొరికిపోతాడో అని మనం కూడా టెన్షన్ పడుతుంటాం.. అన్ని సినిమాలకు ఇలాంటి మ్యాజిక్ అయితే జరగదు. లక్కీ భాస్కర్ విషయంలో అన్నీ అలా కలిసొచ్చాయంతే. ఓ వైపు ఫ్యామిలీ ఎమోషన్స్ పర్ఫెక్టుగా ఎస్టాబ్లిష్ చేస్తూనే.. మరోవైపు హీరో వైపు ఎలివేషన్స్ కూడా ఎక్కడా తగ్గకుండా చూసుకున్నాడు వెంకీ. ముఖ్యంగా సెకండాఫ్ అయితే ఇంకా వేగంగా వెళ్లిపోయింది.

నటీనటులు:

దుల్కర్ సల్మాన్ మరోసారి అదరగొట్టాడు.. ఆయన నటన గురించి ఏం చెప్పాలి..? ఈయనకు ఏ పాత్ర ఇస్తే అందులోకి పరకాయ ప్రవేశం చేస్తుంటాడు. మీనాక్షి చౌదరి కూడా చాలా బాగా నటించింది. తన కెరీర్‌లో ఇప్పటి వరకు చేసిన బెస్ట్ కారెక్టర్ ఇదే. మిగిలిన వాళ్ళలో సాయి కుమార్ నటన బాగుంది. బ్యాంక్ ఎంప్లాయ్స్‌గా శివన్నారాయణ, సచిన్ ఖేడ్‌కర్, టినూ ఆనంద్ బాగున్నారు. మరో ముఖ్యమైన పాత్రలో రాంకీ అద్భుతంగా నటించాడు. హైపర్ ఆది, కసిరెడ్డి తమ తమ పాత్రలకు న్యాయం చేసారు.

టెక్నికల్ టీం:

జివి ప్రకాశ్ కుమార్ మరోసారి సినిమాకు ప్రాణంగా నిలిచాడు. లక్కీ భాస్కర్‌కు సంగీతం బలం. సినిమాటోగ్రఫీ కూడా అదిరిపోయింది. ఎడిటింగ్ చాలా షార్ప్‌గా.. పిన్ పాయింట్‌గా ఉంది. నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. ఇక దర్శకుడు వెంకీ అట్లూరి నెక్ట్స్ లెవల్ అంతే. స్కామ్ 1992 ఛాయలు కనపించినా.. తన రైటింగ్‌తో స్క్రీన్ మీద పెద్ద మ్యాజిక్ చేసాడు వెంకీ అట్లూరి.

పంచ్ లైన్: ఓవరాల్‌గా లక్కీ భాస్కర్.. వెల్ ప్లేడ్.. ష్యూర్ షాట్ విన్నర్..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article