హైదరాబాద్, ఫిబ్రవరి 8: దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక మెడికల్ విద్యా సంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరానికి వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న నీట్-యూజీ 2025 ప్రవేశ పరీక్ష మే 4న నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) శుక్రవారం (ఫిబ్రవరి 7) ప్రకటించింది. మరోవైపు ఫిబ్రవరి 7 నుంచి నీట్ యూజీ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మార్చి 7వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మార్చి 9 నుంచి మార్చి 11 వరకు తమ దరఖాస్తు ఫారమ్‌లో సవరణలు చేసుకోవచ్చు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అభ్యర్ధులు నీట్ యూజీ పరీక్ష కోసం పోటాపోటీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. గతేడాది నీట్ యూజీ 2024 ప్రవేశ పరీక్షకు 24 లక్షల మంది విద్యార్ధులు హాజరవగా.. ఈ సారి ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు.
ఇక ఏడాది ఎన్టీయే రాత పరీక్ష విధానంలో కూడా కీలక మార్పులు తీసుకువచ్చింది. అయితే గతేడాది పేపర్ లీకేజీల నేపథ్యంలో జేఈఈ మెయిన్ తరహాలోనే నీట్ యూజీ 2025 పరీక్ష కూడా ఈసారి ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాలని ఎన్‌టీఏ తొలత భావించింది. ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరి రంగన్ ఛైర్మన్‌గా నియమించిన నిపుణుల కమిటీ సైతం ఆన్‌లైన్ విధానంలోనే నీట్ నిర్వహించాలని సిఫారసు చేసింది. అయితే, విస్తృత చర్చల అనంతరం కేంద్రం ఓఎంఆర్ పద్ధతికే మొగ్గుచూపుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ ఏడాది కూడా నీట్ యూజీ 2025 పరీక్ష ఆఫ్‌లైన్ విధానంలోనే పెన్ను, పేపర్ పద్ధతిలో దేశమంతా ఒకే రోజు.. ఒకే షిఫ్టులో.. జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే నీట్ పరీక్ష విధానంపై సింగిల్ డే – సింగిల్ షిఫ్ట్‌లో పెన్- పేపర్ మోడ్ (ఓఎంఆర్ బేస్డ్)లో నీట్ పరీక్ష నిర్వహిస్తామని జాతీయ పరీక్షా సంస్థ (ఎన్టీఏ) స్పష్టం చేసింది కూడా.
కాగా దేశ వ్యాప్తంగా ఉన్న మెడికాల్ కాలేజీల్లో ఎంబీబీఎస్‌తోపాటు బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీఎస్‌ఎంఎస్ వంటి మెడికల్ కోర్సులకు నీట్ యూజీ ప్రవేశ పరీక్ష యేటా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు నీట్-యూజీకి ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్లలో సిద్ధం అవుతున్నారు. ఈ విద్యా సంవత్సరానికి దేశ వ్యాప్తంగా ఎంబీబీఎస్‌లో మొత్తం 1,08,000 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో సుమారుగా 56 వేల సీట్లు ప్రభుత్వ కాలేజీల్లో, 52 వేల సీట్లు ప్రైవేటు కాలేజీల్లో ఉన్నాయి. సీట్లు లక్ష ఉంటే పోటీ పడే అభ్యర్ధులు మాత్రం భారీగా ఉండటం వల్లనే నీట్ యూజీ పరీక్షకు తీవ్ర పోటీ నెలకొంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.