తాజా రిపోర్ట్ ప్రకారం..ఇండియాలోని పట్టణాల్లో నివసించే వాళ్లలో దాదాపు 70% మంది ఓవర్‌వెయిట్‌తో బాధ పడుతున్నారు. అత్యధికంగా ఒబెసిటీ బాధితులున్న దేశాల్లో అమెరికా, చైనా తరవాత స్థానం భారత్‌దే. దాదాపు 8 కోట్ల మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నంబరే టెన్షన్ పెడుతోంది అనుకుంటే..ఏజ్‌గ్రూప్‌కి సంబంధించిన వివరాలు మరింత టెన్షన్ పెడుతున్నాయి. 5 నుంచి 19 ఏళ్ల లోపు వాళ్లే ఈ ఒబెసిటీ బాధితులుగా ఉంటున్నారు. ఇండియాలో ఆరు కోట్ల మందిలో ఒబెసిటీ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భారీగా పొట్ట రావడం, శరీరంలో కొవ్వు పేరుకుపోవడం లాంటి సింప్టమ్స్ ఉంటున్నాయి. వీళ్లంతా ఒబెసిటీకి దగ్గర్లో ఉన్న వాళ్లే.
ఉన్నట్టుండి ఇప్పుడు ఒబెసిటీ గురించి మాట్లాడడానికి ఓ రీజన్ ఉంది. అదేంటంటే.. ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్‌లో జరిగిన ఓ మీటింగ్‌లో ఒబెసిటీ గురించి ప్రస్తావించారు. దేశంలో చాలా మంది ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారని, ఈ కారణంగా గుండె సంబంధిత వ్యాధులతో పాటు డయాబెటిస్ వస్తోందని చెప్పారు. ఇదే సమయంలో ఆయన ఫిట్ ఇండియా ఉద్యమం గురించీ మాట్లాడారు. ఫిజికల్ యాక్టివిటీని ప్రోత్సహించే విధంగా తీసుకొచ్చిన ఈ ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని సూచిస్తున్నారు మోదీ. ఆయన ఎక్కువగా ఫోకస్ చేసింది రెండే రెండు అంశాలపైన. ఒకటి ఎక్సర్‌సైజ్, మరోది డైట్. పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటూనే అందుకు తగ్గట్టుగా వ్యాయామం చేయాలని సూచించారు. అన్నింటి కన్నా ముఖ్యంగా ఆయన చెప్పిందేంటంటే..నూనెల వినియోగాన్ని 10% వరకూ తగ్గించుకోవడం. యోగా ఎక్స్‌పర్ట్స్ ఎప్పటి నుంచో ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఆయిల్ వాడకం తగ్గిస్తే సగానికి సగం జబ్బులు తగ్గిపోతాయని అంటున్నారు. ఇప్పుడు స్వయంగా మోదీయే ఈ సలహా ఇవ్వడం ఆసక్తికర డిబేట్‌కి తెర తీసింది.
ప్రధాని మోదీ చెప్పిన ఈ సలహాకి బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మద్దతునిచ్చారు. అంతే కాదు. ఒబెసిటీ మన దగ్గరకి రాకూడదంటే..కంటి నిండా నిద్ర ఉండాలని, స్వచ్ఛమైన గాలి, వెలుతురు ఉన్నచోట గడపాలని సలహా ఇచ్చాడు. ప్రాసెస్డ్ ఫుడ్‌ని తగ్గించడంతో పాటు నూనె వాడకాన్ని తగ్గించాలని సూచించాడు. రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ చేస్తే చాలా మంచిదని కూడా చెప్పాడు అక్షయ్ కుమార్. నిజానికి..ఒబెసిటీ అనేది ఎంత పెద్ద సమస్యో అర్థమయ్యేలా చాలా మంది నిపుణులు చెబుతూనే ఉన్నారు. కానీ..ప్రాసెస్డ్ ఫుడ్ విరివిగా దొరకడం, ఆ ఫుడ్ తినడానికి బాలా అలవాటుపడిపోవడం వల్ల ఒబెసిటీ సమస్య అంతకంతకూ పెరుగుతోంది. ఇక ఈ ఒబెసిటీకి మరో ముఖ్య కారణం..లైఫ్‌స్టైల్‌లో మార్పులు రావడం. ఉరుకులు పరుగుల జీవితంలో ఉదయం ఏది పడితే అది తిని ఉద్యోగాలకు వెళ్లి పోతున్నారు. న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం తగ్గిపోయింది. నోటికి రుచి అనిపించింది మాత్రమే తింటున్నారు చాలా మంది. ఇక స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం ఇండియాలో ఎంత కళకళలాడుతోందో చెప్పాల్సిన పని లేదు. ఎక్కడ ఏ బండి దగ్గర చూసినా జనాలు విపరీతంగా ఉంటున్నారు. అంతగా వాటికి అలవాటు పడిపోయారు.
ఇక ఇప్పుడు లైఫ్‌స్టైల్‌తో పాటు ప్రజల టేస్ట్ కూడా మారుతోంది. పెద్ద పెద్ద హోటల్స్ వచ్చేశాయి. రకరకాల ఫుడ్ ఐటమ్స్ అందుబాటులో ఉంటున్నాయి. వాటిని ఏ నూనెలతో తయారు చేస్తున్నారు..? ఎంత క్వాలిటీగా ఉంటున్నాయన్నది పట్టించుకోవడం లేదు. వందలు, వేల రూపాయలు ఖర్చు చేసి ఆ ఆహారాన్నే తీసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగం పెరుగుతోంది. బర్గర్లు, పిజ్జాలు, పఫ్‌లు..సేఫ్ కాదని చెబుతున్నా వాటికున్న డిమాండ్ వాటికి ఎప్పుడూ ఉంటోంది. ఈ మధ్య కాలంలో కాస్త హెల్దీ డైట్‌పై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కొవిడ్ తరవాత చాలా మంది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంపై ఫోకస్ పెడుతున్నారు. కానీ..అదే సమయంలో ఇలా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకునే వాళ్ల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. పిల్లలు కూడా ఇదే లైఫ్‌స్టైల్‌కి అలవాటు పడుతున్నారు. ఓ రిపోర్ట్ చెప్పిన లెక్కల ప్రకారం భారత్‌లో సుమారుగా కోటి 40 లక్షల మంది ఒబెసిటీతో బాధ పడుతున్నారు. వీళ్లలో టైప్ 2 డయాబెటిస్‌తో పాటు, హైపర్ టెన్షన్, గుండె జబ్బులతో పాటు శ్వాస కోశ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇంత చిన్న వయసులోనే ఇన్ని సమస్యలతో బాధ పడాల్సి వస్తోంది.
ఇక మహిళల్లో కొంత మందిలో అబ్డామినల్ ఒబెసిటీ ఉంటోంది. అంటే పొత్తి కడుపు పరిమాణం పెరిగిపోవడం. పురుషుల్లోనూ ఈ సమస్య కనిపిస్తోంది. ఇండియాలో కేరళ, తమిళనాడు, పంజాబ్, ఢిల్లీలో ఒబెసిటీ ప్రాబ్లమ్ ఎక్కువగా ఉన్నప్పటికీ..తెలుగు రాష్ట్రాలనూ ఇది వేధిస్తోంది. ముఖ్యంగా డయాబెటిస్ క్యాపిటల్‌గా పేరు తెచ్చుకున్న హైదరాబాద్‌లో లైఫ్‌స్టైల్ కారణంగానే ఎక్కువ ఒబెసిటీ బాధితులు ఉంటున్నారని చెబుతున్నారు వైద్యులు. అయితే..BMI ద్వారా గతంలో ఒబెసిటీని డిసైడ్ చేసే వాళ్లు. కానీ..ఇప్పుడు ఊబకాయాన్ని గుర్తించేందుకు కొత్త పద్ధతినీ కనుగొన్నారు. BMI నార్మల్ రేంజ్‌లో ఉన్న వాళ్లలోనూ కొవ్వు ఎక్కువగా ఉంటోందని, వాళ్లు రకరకాల సమస్యలతో సతమతం అవుతున్నారని కొన్ని రిపోర్ట్‌లు వెల్లడించాయి. అయితే..DEXA స్కాన్ ద్వారా కచ్చితంగా ఒబెసిటీని గుర్తించొచ్చని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. నడుము కొలతల ఆధారంగా ఒబెసిటీని గుర్తించే ప్రక్రియ ఇది. అంటే నడుము చుట్టూ ఎంత కొవ్వు పేరుకుపోయిందో..ఈ డెక్సా స్కాన్ ద్వారా తెలుస్తుంది. అయితే..ఇది అన్ని చోట్లా ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉంది.