రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన వేలాది మందికి నివాళులు అంటూ తన స్పీచ్‌లో ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా దుమారం రేగింది. రాజ్యసభ ఛైర్మన్ ధన్‌కర్..ఖర్గే వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. మీ అంతట మీరే సంఖ్యని పెంచేస్తారా..అని వారించారు. సభలో మాట్లాడే ప్రతి మాటకీ విలువ ఉంటుందని, అనవసరంగా ఇలాంటి కామెంట్స్ చేయొద్దని అన్నారు. అయితే..దీనిపై ఖర్గే స్పందించారు. తాను ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేయలేదని, ప్రభుత్వం కనీసం ఇప్పటికైనా ఎంత మంది చనిపోయారో లెక్క చెబితే బాగుంటుందని అన్నారు. తాను తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించాలని కోరారు. అయినా సరే.. ప్రభుత్వం మృతుల సంఖ్యను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
మహా కుంభమేళాలో ఇటీవల మౌని అమావాస్య రోజున తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. సవ్యంగా సాగిపోతున్న ఈ ఆధ్యాత్మిక ఉత్సవంలో ఈ ఘటన ఒక్కసారిగా కుదిపేసింది. ఈ ఘటన తరవాత యూపీ సర్కార్ అప్రమత్తమైంది. మరోసారి ప్రమాదం జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. వసంత పంచమిని దృష్టిలో పెట్టుకుని ఈ భద్రతను మరింత పెంచింది. అయితే..ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వంపై తీవ్రంగా మండి పడుతున్నాయి. ఏర్పాట్లలో యోగి సర్కార్ పూర్తిగా విఫలమైందని…అందుకే ఈ ప్రమాదం జరిగిందని విమర్శిస్తున్నాయి. ఇప్పుడు పార్లమెంట్‌లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలు మొదలైన కాసేపటికే ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళనలు చేపట్టాయి. మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై సమాధానం చెప్పండి అంటూ ప్రతిపక్ష ఎంపీలు సభలో గట్టిగా నినాదాలు చేశారు. వెల్‌వైపు దూసుకెళ్లారు. అసలు ఈ ఘటనలో ఎంత మంది చనిపోయారో లెక్క తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు ప్రతిపక్ష ఎంపీలు.
తొక్కిసలాట ఘటనలో ఎక్కువ మంది చనిపోయి ఉంటారని, కానీ ప్రభుత్వం ఆ లెక్కని బయటపెట్టడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రమాదం జరిగాక ఎన్నో గంటల తరవాత మృతుల సంఖ్యని వెల్లడించారని, దీని వెనకాల కుట్ర ఉందని అనుమానిస్తున్నాయి. అయితే..సభలో గట్టిగా నినాదాలు చేయడం వల్ల స్పీకర్ ఓం బిర్లా వాళ్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ప్రతిపక్షాలు సభ సజావుగా సాగకుండా అడ్డుకుంటున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మండి పడ్డారు.
ఇప్పుడే కాదు. ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ని ప్రవేశ పెడుతున్న సమయంలోనూ ప్రతిపక్షాలు ఇదే విధంగా అడ్డుకున్నాయి. పెద్ద ఎత్తు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. అఖిలేష్ యాదవ్ నిరనస చేపట్టారు. ఆ తరవాత సభ నుంచి వాకౌట్ చేశారు. బడ్జెట్ కన్నా ముఖ్యమైనవి ఎన్నో ఉన్నాయని తేల్చి చెప్పిన అఖిలేశ్ యాదవ్…కుంభమేళా గురించి ప్రభుత్వం ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఇంకా అక్కడ చాలా మంది తమ కుటుంబ సభ్యులను వెతుక్కుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. “మహా కుంభమేళాలో ఇప్పటికీ చాలా మంది తమ కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం వెతుకుతున్నారు. తొక్కిసలాటలో చాలా మంది చనిపోయి ఉంటారని మా అనుమానం. కానీ ప్రభుత్వం ఆ లెక్కను బయట పెట్టడం లేదు. ఎంతో మంది అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకుని వాళ్లకి న్యాయం చేస్తే మంచిది” అని అన్నారు అఖిలేష్ యాదవ్..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..