విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణానికి పీవీ సింధు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ.. ఏడాదిలోపు అకాడమీ ప్రారంభించేలా ప్రణాళికలు చేస్తున్నామని, నైపుణ్యం గల క్రీడాకారుల కోసం అకాడమీ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
Pv Sindhu Laid Foundation Stone For Badminton Academy Building
విశాఖ తోటగరువులో బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణానికి పీవీ సింధు భూమి పూజ చేశారు. కుటుంబ సభ్యులతో పాటు ఆమె భూమి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ.. ఏడాదిలోపు అకాడమీ ప్రారంభించేలా ప్రణాళికలు చేస్తున్నామని, నైపుణ్యం గల క్రీడాకారుల కోసం అకాడమీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అకాడమీ ఏర్పాటు ప్రభుత్వం అన్ని అనుమతులతో భూమి కేటాయించిందని, అకాడమీకి కేటాయించిన స్థలంలో జూనియర్ కళాశాల ఏర్పాటుకు డిమాండ్ స్థానికుల నుంచి వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ సమస్యను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లానన్నారు.
గత ప్రభుత్వం 2021 జూన్‌లో పీవీ సింధుకు విశాఖపట్నం రూరల్ మండలం చినగదిలి మండలంలో రెండు ఎకరాలు భూమిని కేటాయించింది. అక్కడ బ్మాడ్మింటన్ అకాడమీ, స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు ఈ భూమిని ఇచ్చారు. అక్కడ 73/11,83/5, 6 సర్వే నెంబర్లలో పశుసంవర్థక శాఖకు చెందిన మూడు ఎకరాల స్థలంలో రెండు ఎకరాలను క్రీడలు, యువజన వ్యవహారాల శాఖకు.. ఒక ఎకరాన్ని వైద్య ఆరోగ్యశాఖకు బదలాయించారు. ఈ మేరకు అప్పుడే రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఆ తర్వాత క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ ఆ రెండు ఎకరాల భూమిని పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ కోసం కేటాయించింది.